రాజగృహంబు కంటె నభిరామముగా నిలు గట్ట గూడ, దే
యోజ నృపాలు డాకృతికి నొప్పగు వేషము లాచరించు, నే
యోజ విహారముల్ సలుప నుల్లమునం గడువేడ్క సేయు, నే
యోజ విదగ్ధు డై పలుకు, నొడ్డులకుం దగ దట్లు సేయగన్.
పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసానికి సమాయత్తమవుతున్న సమయంలో, ధౌమ్యుడు వారికి సేవాధర్మాన్ని గురించి చెప్పాడు.
" రాజుగారి ఇంటికి ఎదురుగా తక్కినవారు ఇల్లు కట్టకూడదు. రాజుగారు వస్త్రధారణ చేసిన రీతిలో ఇతరులు వస్త్రధారణ చేయకూడదు. రాజుగారు ఏ రకంగా విహారాలు సలుపుతున్నాడో, ఆ విధంగానే ఇతరులు కూడా అటువంటి సరస సల్లపాల్లో తేలియాడకూడదు. రాజుగారు మాట్లాడిన పద్ధతిలో ఇతరులు అనుకరణ చేయకూడదు. "
ఏ + ఓజన్ = ఏ రకంగా
ఒడ్డులకున్ = అన్యులకు, ఇతరులకు.
రాజులకు ఆభిజాత్యం ఎక్కువ. అందరికంటే గొప్పగా ఉండాలని, కనిపించాలని అనుకుంటారు. అది వారి రాజసానికి గుర్తు. రాజుగారి కొలువులో గాని, రాజ్యంలో గాని పని చేసే అధికారులు, సేవకులు, రాజుగారి కంటె గొప్పగా ఉండాలని గాని, కనిపించాలని గాని అనుకోకూడదు. అది వారికి ప్రమాదహేతువు. రాజుగారికైనా కోపకారణం కావచ్చు లేక ఇతరులు ఈర్ష్యతో రాజుగారికి కొండాలైనా చెప్పవచ్చు. దుస్తుల విషయంలో కూడా అంతే. రాజుగారిని మించిన దుస్తులు ధరిస్తే, అది రాజుగారి పట్ల అవిధేయతను, ఆధిక్యతను తెలియజేస్తుంది. ఇక ఆహారవిహారాదులు. వాటి విషయంలో కూడా, ఇతరులు తమ పరిమితిని తెలుసుకొని అణకువతో ప్రవర్తిస్తే మంచిది.
ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న ఈ రోజుల్లో కూడ, బాహాటంగా పై అధికారుల కంటె ఆధిక్యతను ప్రదర్శించడం అవివేకమే అవుతుంది.
ధౌమ్యుని ఈ చక్కని హితబోధ శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వం, ప్రథమాశ్వాసంలో ఉంది.
V
No comments:
Post a Comment