ఏలిన వానిని, దైవము,
నాలిని, బంధులను సముచితారాధన సం
శీలత బ్రీతుల జేయని
పాలసుడా ఫలము లాసపడు, మనుజేంద్రా !
నమ్మి గలవారి నొల్లరు
త మ్మొల్లని వారి వెనుక దగులుదు, రధిక
త్వ మెఱిగి యెఱిగి తొడరుదు
రి మ్మెఱుగని యట్టివార లిభపురనాథా !
శ్రీమదాంధ్ర మహాభారతము, ఉద్యోగపర్వం, ద్వితీయాశ్వాసంలో విదురనీతి ఉన్నది. అందులో భాగమే ఈ రెండు పద్యాలు.
" రాజును, దైవాన్ని, కట్టుకున్న భార్యను, బంధువులను, తగిన రీతిలో ఆదరించని మూర్ఖుడు మంచి ఫలితాలను పొందలేడు. "
మానవుడు సంఘజీవి. అతనికి రెండు పరిధులు ఉన్నాయి. ఒకటి ఆంతరంగిక పరిధి, రెండోది బాహ్య పరిధి. ఆంతరంగికంగా, తన ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, బంధువులు. బాహ్యంగా, తాను బ్రతుకుతున్న లోకం. ఇందులో రాజు, దైవము ముఖ్యం. తన జీవనానికి రాజుగారి అండ, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దైవము యొక్క అనుగ్రహం చాలా అవసరం. వీటిని గుర్తెరుగని మూఢుడు మనుగడ సాగించలేడు.
" ధృతరాష్ట్ర మహారాజా! కొందరు తమను ప్రేమించేవారిని ఇష్టపడరు; తమను ఇష్టపడని వారి కోసం ప్రాకులాడుతుంటారు. తమకంటె బలవంతులు, అధికులు అని తెలిసికూడా వారిని ఎదిరిస్తారు. ఇవి తెలివితక్కువవాళ్ళు చేసే పనులు. "
లోకం తీరుని గురించి చెబుతున్నట్లు పైకి కనిపిస్తున్నా, విదురుడు చెప్పినవన్నీ దుర్యోధనాదులకు వర్తించేవే. వాళ్ళు తమ హితాన్ని కోరే, భీష్మ, ద్రోణ, విదురుల మాట వినరు. కల్లబొల్లి మాటలు చెప్పి తమ పబ్బం గడుపుకొనే శకుని లాంటి వారిని నెత్తి కెక్కించుకుంటారు. తమకంటే బలవంతులని తెలిసీ, పాండవులతో కయ్యానికి దిగుతారు. ఇది మూర్ఖత్వం కాక మరేమిటి?
డాక్టరు టి. రామకృష్ణమూర్తి, సూరం శ్రీనివాసులుగార్లు తమ గ్రంధ0 " భారత నిరుక్తి - తిక్కన సరసోక్తి " లో, ఒక శ్లోకాన్ని ఉదహరిస్తూ యీ విధంగా వ్యాఖ్యానించారు.
" ద్వా విమౌపురుషౌ మూర్ఖౌ దుర్యోధన దశాననౌ
గోగ్రహం వనభంగం చ దృష్ట్వాయుద్ధం (విచక్రతుః) "
మూర్ఖుడు తనకు తెలియదు ఇతరులు చెప్పింది వినడు అనే రీతిలో ఉంటాడు. లోకంలో ఇద్దరే ఇద్దరు మూర్ఖు లున్నారు. ఒకడు దుర్యోధనుడు. రెండవవాడు రావణాసురుడు. ఈ దుర్యోధనుడు మొదలయిన ఆరుగురు (భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు, కర్ణ దుర్యోధనులు) ఉత్తర గోగ్రహణంలో నిస్సహాయుడయిన అర్జునుడి చేతిలో ఓడిపోయారు. అయినా దుర్యోధనుడికి తెలిసిరాలేదు. పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అధికులని తెలిసికూడా వారితో యుద్ధానికి దిగడం మూర్ఖలక్షణం. అలాగే రావణాసురుడూను. ఒక్క ఆంజనేయుడు సముద్రము దాటివచ్చి లంకనంతా నాశనం చేసి వెళ్ళాడు. " ఒక్క కోతే ఇంత ధ్వసం చేసిపోయాడే, ఇక ఆ రాముడు ఎంత చేస్తాడో " అని ఊహించలేకపోయాడు.
ఇదే అసలయిన మూర్ఖలక్షణం.
No comments:
Post a Comment