చిత్తము వొక్కెడుం బురుషసింహుని, బౌత్రకులాగ్రగణ్యు, న
త్యుత్తమతేజు, భూరిగుణు, నొప్పెడు మెత్తని మేని వాని, నె
ట్లుత్తల పెట్టిరో పలువు రుగ్రమనస్కులు గూడి యక్కటా!
యత్తెఱ గెల్ల దేటపడునట్టులుగా వివరించి చెప్పుమా!
అది ద్రోణాచార్యుడి మూడవనాటి యుద్ధం. ఆ నాటి యుద్ధంలో అభిమన్యుడు మరణించాడని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.
అభిమన్యుడి మరణ వార్త విన్న ధృతరాష్ట్రుని మానసికస్థితిని తెలియజెప్పేది యీ పద్యం.
ఈ పద్యంలో, ధృతరాష్ట్రుని నోట ఐదు విశేషణాలు వెలువడ్డాయి. అవి అన్నీ అభిమన్యుని గొప్పతనాన్ని చాటిచెప్పేవే. అయితే అవి అక్షరసత్యాలయినా, ధృతరాష్ట్రుని నోట రావడమే వింతగొలిపే విషయం. అభిమన్యుడు పురుషులలో శ్రేష్ఠుడని, తన మనుమలలో ఎన్నదగినవాడని, ప్రరాక్రమశాలి అని, సుగుణసంపద కలవాడని, సుకుమారుడని ధృతరాష్ట్రుడు సంజయుని వద్ద పొగిడి, అతడి మరణానికి చాలా బాధపడుతున్నానని చెప్పాడు. అంతేగాక, అటువంటివాడిని, అంతమంది క్రూరహృదయులు ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి యెట్లా చంపారని అడిగాడు. ఆ విశేషాలన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పమని సంజయుణ్ణి అడిగాడు.
అభిమన్యుడి మరణానికి ధృతరాష్ట్రుడు నిజంగా బాధపడుతున్నాడా లేక సంజయుని ముందర కపటప్రేమను ఒలకబోస్తున్నాడా? పుత్రవ్యామోహంతో, జాత్యంధతకు తోడు మానసిక అంధత్వాన్ని కొనితెచ్చుకొన్న ధృతరాష్ట్రుడికి అభిమన్యుడిపై ఇంత ప్రేమ ఎట్లా పుట్టుకు వచ్చిందని సందేహం. పెద్దలు చెప్పినట్లు, మహాభారతం ఒక మనోవైజ్ఞానిక శాస్త్రం. మహాభారతం సమగ్రంగా పరిశీలిస్తే ధృతరాష్ట్రుని మనస్సులోని అనేకమైన పొరలు కనపడతాయి. ధృతరాష్ట్రుడు ధర్మం తెలియనివాడా అంటే, కాదనటానికి మహాభారతంలోనే ఎన్నో దృష్టాంతాలున్నాయి. పలు సందర్భాలలో, ధృతరాష్ట్రుడు దుర్యోధనుని దుర్నీతిని గర్హించాడు. అయితే, అతడి మితిమీరిన పుత్రవ్యామోహం, ధర్మమనే పొరను కప్పిపెట్టిందనిపిస్తుంది. ఒకరకంగా, ధృతరాష్ట్రుడు తెలిసిన మూఢుడు అనుకోవాలి. అన్నీ తెలిసినా, ఏమీ చేయలేని నిస్సహాయుడు.
ఇక ఈ పద్యాన్ని కవిత్వ పరంగా చూస్తే, పద్యంలో ఎక్కువభాగం అచ్చ తెలుగు పదబంధాలు కనపడతాయి. అందులో ముఖ్యమైనది ' చిత్తము పొక్కటం ' . పొక్కితే బాధ కలుగుతుంది. అంటే మనస్సుకి బాధ కలగడం. రెండోది, అతి సుకుమారుడని చెప్పడానికి ' ఒప్పెడు మెత్తని మేని వాని ' అనేది. ' యెట్లుత్తల పెట్టిరో ' , ' అత్తెఱగు ' , ' తేటపడునట్టులుగా ' అన్న అచ్చ తెలుగు పదబంధాలు పద్యానికి అందాన్ని తెచ్చిపెట్టాయి.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణ పర్వము, ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment