వింగడమైన యొక్క వనవీథి గనుంగొనె నీడ సున్నపుం
రంగుటరంగు పచ్చల యరం గయిపో వెలిదమ్మి బావికిం
జెంగట నుల్లసిల్లు తులసీ వనసీమ శుభాంగి నొక్క బా
లం గురువిందకందళదళప్రతిమాంఘ్రికరోదరాధరన్.
కనుగొని విస్మయం బొదవగా గదియం జని సౌకుమార్యముం
దను రుచియున్సులక్షణ వితానము దేజము జెల్వు గొంత సే
పనిమిష దృష్టి జూచి యహహా ! యనపత్యున కమ్ముకుందు డే
తనయగ నాకు నీ శిశువు గృప సేసె నటంచు హృష్టుడై.
కొనిపోయి ధర్మగేహిని !
కనురక్తి నొసంగ బొంగి యాయమయును జే
పు నిజస్తన్యంబున లలి
బెనిచెన్గోమొప్ప నిట్లు పెరుగ గ్రమమునన్.
శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని ఈ మూడు పద్యాలు గోదాదేవి వృత్తాంతానికి నాంది పలుకుతాయి.
విష్ణుచిత్తుడు విష్ణుభక్తుడు. శ్రీవిల్లిపుత్తూరులో కొలువున్న శ్రీరంగనాథుని సేవిస్తూ, ప్రతిరోజు మాలాకైంకర్యం చేస్తున్నాడు.
ఒకరోజు అతడు పూలను సేకరించడం కోసం ఉద్యానవనంలో తిరుగుతున్నాడు. తోటలో ఒక ప్రక్కన విశాలమైన, సున్నం వేసిన అరుగు ఉంది. ఆ అరుగు మీద సమీపంలో ఉన్న చెట్ల ఆకుల నీడ పడి, అరుగు మరకత మణులతో తాపడం చేసినట్లుగా కనపడుతున్నది. అరుగు ప్రక్క తెల్లతామరల దిగుడుబావి ఉంది. ఆ బావి ప్రక్కనే ఏపుగా పెరిగిన మొక్కలతో తులసివనం ఉంది. ఆ తులసివనంలో ఒక పసిపిల్లను విష్ణుచిత్తుడు చూసాడు. పసిపిల్ల లేలేత చేతులు, కెంపురంగులో ఉన్న దేహకాంతిని చూస్తే, ఆ పసిపిల్ల ఏదో దివ్యలోకానికి చెందినదిగా అనిపిస్తున్నది. పసిబిడ్డను చూడగానే శుభలక్షణాలున్నట్లుగా గ్రహించాడు విష్ణుచిత్తుడు.ఆ పసిదాన్ని చూసి, విష్ణుచిత్తుడు, సంతానం లేని తనకు శ్రీరంగనాథుడే ఆ పసిబిడ్డను కూతురుగా ప్రసాదించాడని సంతోషించాడు.
ఇక్కడ, ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర్రావుగారి సౌందర్యలహరి వ్యాఖ్యానం ప్రస్తావించటం సముచితంగా ఉంటుంది. ఏదైనా వస్తువును గాని, వ్యక్తిని గాని క్రొత్తగా చూసినప్పుడు కలిగేది ఆశ్చర్యం. అదే వస్తువును గాని, వ్యక్తిని గాని రెండవసారి చూస్తే ఆశ్చర్యం కలుగదు. ఎప్పుడూ చూసినా తనివి తీరనిది విస్మయం. ఇది అద్భుతమైన ఒక మానసిక స్థితి.
తులసితోటలో కనపడ్డ పసిబిడ్డ దివ్యశిశువు కనుక, తేజస్సు, శుభలక్షణ వితానం, చెల్వు, రుచి, లోకోత్తరమైన ఆకర్షణ, దివ్యత్వం - ఇవన్నీ అవతార లక్షణాలని ఆచార్యులవారు వ్యాఖ్యానించారు.
విష్ణుచిత్తుడు, ఆ బిడ్డను తీసుకుపోయి తన భార్యకు ఇచ్చాడు. ఆ అమ్మ కూడ ప్రేమతో పొంగిపోయి, పాలు చేపింది. బిడ్డకు పాలిచ్చి, గారాబంగా పెంచసాగింది.
కంద పద్యంలోని " ధర్మగేహిని "'అనే పదం ' గృహస్థ ధర్మానికి అనుకూలమైన ఇల్లాలు ' అని అర్థం చేసుకోవాలి. అద్వైతంలో సన్యాసాశ్రమానికి, విశిష్టాద్వైతంలో గృహస్థాశ్రమానికి ప్రాముఖ్యత అని, శ్రీరామకృష్ణ పరమ హంస జీవితంలో శారదాదేవి ధర్మగేహిని అని ఆచార్యులవారు వివరించారు.
No comments:
Post a Comment