తెలియ నీయనయు నధీతఋగ్యజుషుండు
స్వర నిబద్ధ శుద్ధ సామవేద
నిత్యగాన జనిత నిభృత సమశ్రుతి
సర్వశాస్త్రములయు జ్ఞానరాశి.
అనపమృషితంబు ఘుషితంబునైన వాక్కు
త్రిస్థల వ్యంజకంబగు తీవ్రరవము
పూత వేదశిఖా సారభూత బుద్ధి
యౌచితీజ్ఞాన పర్యాప్తమైన మనసు.
ఋష్యమూక పర్వతప్రాంతంలో, ధనుర్ధారులై తిరుగుతున్న రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు భయకంపితుడయ్యాడు. వారిద్దరూ, తన అన్న వాలి పంపగా తనను వధించడానికి వస్తున్నాడని అనుకున్నాడు. సందేహనివృత్తి కోసం, తన మంత్రి హనుమంతుడిని రామలక్ష్మణుల వద్దకు పంపాడు. హనుమంతుడు బ్రాహ్మణవేషంలో వారిని కలుసుకొని, సుగ్రీవుని దీనగాథను వివరించి, అతడు రామలక్ష్మణుల మైత్రిని వాంఛిస్తున్నాడని చెప్పాడు. తరువాత, తనను తాను పరిచయం చేసుకొనటం మర్యాద కనుక, తన తండ్రి కేసరి అని, అమ్మగారు అంజనాదేవి అని, తన పేరు హనుమంతుడని ముచ్చటగా మూడు ముక్కలు చెప్పి ఊరుకున్నాడు. దానితో మురిసిపోయిన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లా అన్నాడు.
" ఈయనను చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదము చక్కగా అధ్యయనం చేసినట్లున్నాడు. సస్వరంగా, సుస్వరంతో సామవేదం గానం చేయడం వల్ల శ్రుతి సుభగత్వం, తూచినట్లుగా మాట్లాడటం తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. ఇతడు సర్వశాస్త్రాలను ఔపోసన పట్టి, దాని సారాన్ని చక్కగా గ్రహించినట్లుగా ఉన్నాడు. ఇతని వాక్కులో ఋజుత్వం, గాంభీర్యం కొట్టొచ్చినట్లుగా కనపడుతున్నాయి. అంతేకాకుండా, ఇతని వాక్కు నాభి నుండి బయలుదేరి, కంఠము ద్వారా వినిర్గతమయి, నోటి నుండి వెలువడుతున్నట్లున్నది. అందుకే ఇతనిలో శాబ్దిక గాంభీర్యము, శ్రావ్యత కనపడుతున్నాయి. ఇతని బుద్ధి చూస్తే పవిత్రమైన వేదాంత ధోరణిలో ఉంది. ఇక మనస్సు జ్ఞానముతో పరిపూర్ణమయినట్లుగా కనపడుతున్నది. "
శ్రీరాముడు హనుమంతుని వాజ్ఞియంత్రణకు, వినయానికి, బుద్ధి కుశలతకు, సర్వశాస్త్రపారీణతకు ముగ్ధుడయ్యాడు. ఆ మాటనే భాషాపరశేషభోగి అయిన లక్ష్మణునితో పంచుకున్నాడు.
ఈ సన్నివేశం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధాకాండము, నూపుర ఖండములో ఉన్నది.
No comments:
Post a Comment