హరి సాధింతు, హరిన్ గ్రసింతు, హరి ప్రాణాంతంబు నొందింతు దా
హరికిన్ వైరి నటంచు, వీడు పటురోషాయత్తుడై యెప్పుడుం
దిరుగుం, బ్రువ్వదు నోరు, వ్రీలిపడ దా దేహంబు, దాహంబుతో
నరకప్రాప్తియు నొంద, డే క్రియ జగన్నాథుం బ్రవేశించెనో?
గ్రసింతున్ = మ్రింగుతాను
ప్రువ్వదు = పుచ్చిపోదు
వ్రీలి = విరిగి
ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. ఆ యాగంలో భాగంగా శ్రీకృష్ణుణ్ణి అగ్రపూజకు అర్హుడని నిర్ణయించాడు భీష్ముడు. భీష్ముని నిర్ణయం ప్రాకారం, కృష్ణుడికి అర్ఘ్య మివ్వడానికి ధర్మరాజు సమాయత్తమయ్యాడు. అది చూసి కోపంతో, శిశుపాలుడు కృష్ణుడిని పలు విధాలుగా దూషించాడు. శిశుపాలుని తల్లి కిచ్చిన మాట ప్రకారం, నూరు తప్పులను సైరించిన కృష్ణుడు, శిశుపాలుని శిరస్సును తన నిశిత చక్రధారలతో ఖండించాడు. అందరూ చూస్తుండగా, శిశుపాలుని దేహం నుండి వెలువడిన వెలుగు, శ్రీకృష్ణుని దివ్యతేజస్సులో లీనమయింది. అది చూసిన ధర్మరాజు ఆశ్చర్యంతో నారదుణ్ణి ఇలా ప్రశ్నించాడు.
" మునీంద్రా ! ఈ శిశుపాలు డెప్పుడూ కృష్ణుని ఓడిస్తాను, మ్రింగుతాను, ప్రాణాలు తీస్తాను, తాను కృష్ణుడికి శత్రువునంటూ, కోపంతో ఊగిపోతూ తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాడి నోరు పుచ్చిపోదు, దేహం పడిపోదు, నరకంలో యాతనలు పడదు. అట్లా కాకపోగా, , శిశుపాలుని దేహం నుండి వచ్చిన వెలుగు, ఏ విధంగా జగన్నాథుడైన కృష్ణునిలో ప్రవేశించింది?
శిశుపాలుడు చేసిన వైరక్రియ లన్నిటిలోను సంతత హరినామ స్మరణ తప్ప ఇంకొకటి లేదు. అట్టివారికి మోక్ష మిస్తానని భగవంతుడే చెప్పాడు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభాగవతము, సప్తమ స్కంధము నందలిది.
No comments:
Post a Comment