పరువిడి పోయి తెచ్చి ఘనపాశచయంబుల నంటగట్టి య
గ్గురుభుజు లందఱుంగదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిం
దరలగ దీయలేక దగ దట్టముగా మది దుట్టగిల్ల నొం
డొరు గడవంగ వే చని పయోరుహనాభున కంత జెప్పినన్.
వీని సరసీరుహాక్షు డతి విస్మితుడై జలశూన్యకూప మ
ల్లన కదియంగ నేగి కృకలాసము నొజ్జ తృణంబు బోలె గొ
బ్బున వెడలించె వామకరపద్మమునన్నది యంతలోన గాం
చనరుచి మేన గల్గు పురుషత్వముతో బొడసూపి నిల్చినన్.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధములో నృగోపాఖ్యానం ఉంది.
ఒకరోజు, శ్రీకృష్ణుడి కొడుకులు ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారువు, భానుడు మొదలైనవారు చాలసేపు ఉద్యానవనంలో విహారం చేసి అలసిపోయారు. వాళ్ళకు బాగా దాహం వేసింది. ప్రక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళి, దానిలోకి తొంగిచూశారు. అందులో కొండంత ఊసరవెల్లి కనిపించింది. వాళ్ళంతా కలిసి దాన్ని బయటకు తీయాలనుకున్నారు. పరుగెత్తుకొని వెళ్ళి, పొడుగైన తాళ్ళు తెచ్చారు. అందరూ కలిసి దాన్ని బయటకు లాగుదామన్నుకున్నా, అది వాళ్ళవల్ల కాలేదు. ఈ విషయం వెళ్ళి తండ్రి కృష్ణుడికి చెప్పారు. ఆయన కూడా ఆశ్చర్యానికి లోనయి, బావి దగ్గరికి వెళ్ళి, తన ఎడమచేత్తో, ఒక గడ్డిపరకను తీసినట్లుగా, అవలీలగా ఊసరవెల్లిని బయటకు తీసివేసాడు. శ్రీకృష్ణుని చేయి తగలగానే, ఆ ఊసరవెల్లి బంగారం రంగులో ప్రకాశించే ఒక దివ్యపురుషుడి రూపం పొందింది.
ఈ రెండు పద్యాలు నృగుడి కథను పాఠకుడికి పరిచయం చేస్తాయి.
No comments:
Post a Comment