అనయము పుట్టె జూదమున యప్పుడ, యెంతయు జిచ్చు వెట్టి కా
ల్చినయది నీ యుపేక్షయ; వశీకృతచిత్తుడు ధర్మసూతి మె
త్తనిపులి, యెల్లవారలు నధర్మము నీ పయి బెట్టునంతకు
న్వినడును గానడుం, బిదప నీకును నాకు మరల్ప వచ్చునే?
ఉద్యోగపర్వంలో ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం. ఈ పద్యం లోని విశేషాంశాలు డాక్టరు జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారి వ్యాఖ్యానం ఆధారంగా, నాకు అర్థమయినంత మేరకు మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను.
సంజయుడు పాండవుల వద్దకు వెళ్ళివచ్చి, వారి మనోగతాన్ని ధృతరాష్ట్రునికి చెప్పే సందర్భమిది. అయితే, ఇందులో పాండవుల సందేశం కంటే, సంజయుని సత్యము, ధర్మముతో కూడిన స్పందన ఎక్కువ కనపడుతుంది.
ఈ పద్యంలో, సంజయుని వాక్యవిన్యాసం తిక్కనగారి రచనాశిల్పానికి పరమోదాహరణం. ముఖ్యంగా, " చిచ్చువెట్టి కాల్చినయది, వశీకృతచిత్తుడు ధర్మసూతి మెత్తనిపులి, అధర్మము నీ పయి బెట్టునంతకు న్వినడును గానడుం, పిదప నీకును నాకు మరల్ప వచ్చునే? , అన్న వాక్యాలు, మధ్య మధ్య విరామంతో చెప్పడం చేత, సంజయుని వివేచనాశక్తిని, వినేవారిని ఆలోచింపజేసే స్వభావాన్ని పట్టియిస్తుంది.
ఇక పద్యం మొత్తాన్ని, ఈ వాక్యాల ఆధారంగా పరిశీలిద్దాము. మాయాద్యూతంలో పాండవులను ఓడించి, ద్రౌపదిని అవమానించి, కట్టుబట్టలతో అడవులకు పంపించారు కౌరవులు. అప్పుడే అవినీతికి, అధర్మానికి బీజం పడి, కీడుకు దారితీసింది. దానికి తోడు, పెదతండ్రియైన ధృతరాష్ట్రుని ఉదాసీనత, అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆ చిచ్చు పాండవుల హృదయాలను దహించివేసింది. అయితే, పాండవాగ్రజుడు, వశీకృతచిత్తుడు. తన బుద్ధిని అదుపులో పెట్టుకొన్నవాడు. ఎప్పుడూ ఒదగాలో యెప్పుడూ ఎదగాలో తెలిసినవాడు. అందునా, ధర్మసూతి, యమధర్మరాజు కొడుకు. అంటే, అనువుగాని చోట అధికుల మనరాదు అని ఇప్పుడు సంయమనం పాటించినా, సమయం వచ్చినపుడు కౌరవుల అంతం చూడకుండా ఊరుకోడు. మృత్యువు ఎప్పుడొస్తుందో తెలియదు. మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చిన పులి, యెప్పుడు పంజా విసురుతుందో తెలియదు. అందుకే, ధర్మరాజును మెత్తని పులి అన్నారు తిక్కనగారు. తెలుగు సాహిత్యంలో ధర్మరాజు పరంగా ప్రయోగించిన యీ పదబంధం, యీ బిరుదు, తిక్కనగారిని తారాపథంలోకి తీసుకువెళ్ళి, పండితుల, పామరుల ప్రశంసలు అందుకొనేటట్లు చేసింది.
ఇక లోకమంతా, పెదతండ్రి అయియుండి కూడా, ధృతరాష్ట్రుడు పాండవులకు అన్యాయం చేసాడు అనుకొనే దాక, ధర్మరాజు వినడును కానడుం, అనగా, ఉలకడు పలకడు. అప్పుడు, నీకు, నాకు అతడిని ఆపడం సాధ్యమా? అని ప్రశ్నించాడు సంజయుడు. ఇప్పుడిక ధృతరాష్ట్రునికి భయంతో నిద్ర పడుతుందా?
తిక్కనగారు వాడిన తెలుగు జాతీయాలు, నానుడులు, నుడికారాలు, పద్యాని కొక శోభను తేవడమే గాక, లోతయిన అర్థాన్ని ధ్వనింపజేసాయి. అదే తిక్కనగారి పరమ రమణీయమైన రచనాశిల్పం. అందుకే, విశ్వనాథ వారన్నట్లు " తిక్కన శిల్పంపు తెనుగు తోట. "
ఈ పద్యం తిక్కన భారతము, ఉద్యోగపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment