మయుడనే రాక్షసశిల్పి ధర్మరాజు కోసం మయసభ నిర్మించాడు. ధర్మరాజు సభాప్రవేశం చేశాడు. ఆ తరువాత ఒకరోజు నారదుడు పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజునకు కొన్ని రాజనీతి విషయాలు చెప్పాడు.
*అనఘా! నీ ప్రస్తవమున నని నీల్గిన వీరభటుల యనుపోష్యుల నె
ల్లను బ్రోతె భోజనాచ్ఛాదనముల వారలకు నెమ్మి దఱుగక యుండన్.
" ధర్మరాజా! నీ కోసం యుద్దం చేసి కొంతమంది వీరమరణం పొంది ఉంటారు. వారి కుటుంబాలకు కూడుగుడ్డలకు లోటు లేకుండా చూస్తూ, వారికి సంతోషాన్ని కలిగిస్తున్నావు కదా! "
ప్రభుత్వంలో పనిచేసిన వారిని, వారి కుటుంబాలను, అవసరమైనప్పుడు, అవసానకాలంలో ఆదుకొనడం ప్రభుత్వం బాధ్యత. దీనివల్ల, మహాభారత కాలంలోనే మనకు కుటుంబ పింఛను పథకము ఉన్నదని తెలుస్తున్నది.
*వార్తయంద జగము వర్తిల్లుచున్నది యదియు లేనినాడ యఖిలజనులు
నంధకారమగ్ను లగుదురు గావున వార్త నిర్వహింప వలయు బతికి.
" వార్త ఆధారంగానే యీ ప్రపంచమంతా నడుస్తున్నది. అదే లేకపోతే, ప్రజలు అంధకారంలో మునిగిపోతారు. అందువల్ల, పాలకుడు సరిగా వార్తలను తెలిపే వ్యవస్థను నిర్వహించాలి. "
వార్త అంటే వృత్తాంతం. ఎక్కడ, ఎవరికి, ఏమి కావాలో, ఏమి జరుగుతున్నదో తెలిపే/ తెలుసుకొనే వ్యవస్థ. సరియైన సమాచారం, ప్రజలకు కానీ, పాలకులకు కానీ సరైన సమయంలో అందకపోతే, ప్రజలు కష్టాల పాలవుతారు. వారి జీవితాలు చీకటిమయమవుతాయి. దీనివల్ల, ఈ నాటి వార్తాపత్రికల ఆవశ్యకతను ఆనాడే గుర్తెరిగారని మనసు తెలుస్తున్నది.
పై రెండు పద్యాలు నన్నయ భారతము, సభాపర్వము, ప్రథమాశ్వాసములో ఉన్నాయి. ఈ పద్యాలు, నన్నయగారి సూక్తినిధిత్వానికి చక్కని ఉదాహరణలు.
No comments:
Post a Comment