సముడై యెవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసియై యొంటి బో
వ మహాభీతి నోహో! కుమార యనుచున్ వ్యాసుండు చీరంగ వృ
క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కంజేసె మున్నట్టి భూ
తమయున్ మ్రొక్కెద బాదరాయణ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్.
శుకుడు వ్యాసుని కొడుకు. పరీక్షిన్మహారాజుకి మహాభాగవత పురాణ కథ చెప్పాడు. ఆ శుకమహర్షిని గురించి చెప్పిన పద్యమిది.
అన్ని ప్రాణుల యెడ సమభావం కలిగిన వాడు శుకుడు. ఆయన సర్వసంగపరిత్యాగి, వైరాగ్యభావం కలిగినవాడు, మహాయోగి. అటువంటి, శుకుడు ఒంటరిగా అరణ్యంలో వెళ్ళడం చూసిన వ్యాసుడు, " కుమారా! " అని వెనుకనుంచి పెద్దగా పిలువగా, అడవిలో నున్న చెట్లన్నీ తన్మయత్వంతో " ఓ! ఓ! " అని బదులు చెప్పాయి. ఆ రకంగా సర్వభూతములతోను మమేకమైన, తపోధనుడు, మహామనీషి, వ్యాసునిపుత్రుడైన శుకునికి నమస్కరిస్తున్నాను అని యీ పద్య భావము.
ఈ పద్యం బమ్మెర పోతన రచించిన శ్రీమదాంధ్రమహాభాగవతము ప్రథమ స్కంధము లోనిది.
No comments:
Post a Comment