నీ కారుణ్యము సాటి దాని కదియే, నీ యీ కృపాలేశ మీ
నాకున్ దోచెను గించిదేతదుదితానందంబు దైనందిన
ప్రాకట్యంబును బొందఁజేసి నను సంరక్షించు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై తొమ్మిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నీ కరుణకు సాటి ఏదో తెలియచెబుతాను గానీ, నిజం చెప్పాలంటే, దాని కదే సాటి. నీ దయ అనేది యీ కొంచెం అయినా నాకు తెలిసింది. నీ కృప వల్ల కలిగే ఆ ఆనందం, దైనందిన జీవితంలో నాకు అనుభవమయ్యేటట్లుగా చేసి, నన్ను చల్లగా కాపాడు తండ్రీ ! "
పరమేశ్వరుడు ఆనందైకమయస్వరూపుడు. ఆ ఆనందం కించిత్తు అనుభవమైనా జీవితం ధన్యమైనట్లేనని, దైనందిన చర్యలో ఆ బ్రహ్మానందానుభూతి కొంచెం అయినా కలిగించమని విశ్వనాథ వేడుకొంటున్నారు.