అవి తల్లి కాలియందెలు
నవి గురుతే నాకు నిచ్చ లాయమ చరణ
చ్ఛవిదీప్తములై వెలిఁగెడు
నవి రూపముచేతఁ గష్టమయ్యె గురు తిడన్.
సంజలను రెంట నా నమస్కారసరణి
నేను పదుమూఁడువర్షంబు లెఱిగియుంటి
నివి విడిగ నూపురములని యిపుడు తెలిసి
చేతము విభక్తికిని నింతసేపు పట్టె.
శ్రీరామసుగ్రీవులకు అగ్నిసాక్షిగా మైత్రీబంధం ఏర్పడింది. ధర్మ పరిరక్షణార్థం, రాజైన భరతుని ప్రతినిధిగా, వాలిని సంహరించి, సుగ్రీవుని భార్యను తిరిగి ఇప్పించటంతో పాటు వానర రాజ్యానికి అతడిని రాజును చేస్తానన్నాడు రాముడు. అపారమైన కపిసేనతో, అన్ని దిక్కులా సీతాన్వేషణ చేయిస్తానన్నాడు సుగ్రీవుడు. మాటల సందర్భంలో, ఎవరో ఒకామె రోదిస్తూ, పుష్పకవిమానం మీద నుండి ఒక మూటను ఋష్యమూక పర్వతము మీద నుండి జారవిడిచిందని చెప్పాడు సుగ్రీవుడు. రామలక్ష్మణులు చెప్పినదానిని బట్టి, ఆ మహాసాధ్వి, రాముని భార్య సీత అని గ్రహించాడు సుగ్రీవుడు. సీత జారవిడిచిన నగలమూటను తెప్పించి వారికి చూపించాడు. మూటను విప్పదీసి చూసిన రాముని కళ్ళలో నీరు క్రమ్ముకొంది. అప్పుడు లక్ష్మణుడు నగలను చూసి, అందులోని ఒక్క కాలి అందెలను మాత్రం గుర్తించానని చెప్పాడు.
" అవి తప్పకుండా నా తల్లి సీతమ్మ కాలి అందెలే. అవి నాకు బాగా గుర్తు. ఎందుకంటే, అవి ఆమె తేజోవంతమైన పాదాల కాంతి పడి ప్రకాశిస్తూ ఉండేవి. పదమూడేండ్ల నుండి ఉభయసంధ్యలలోను నేను ఆ పాదాలకు నమస్కరించే వాడిని. నాకు ఇప్పుడే తెలిసింది అవి కాలి అందెలని. పాదాలకు భిన్నంగా వాటిని కాలి అందెలుగా తెలుసుకొనడానికి నా బుద్ధికి ఇంతసేపు పట్టింది. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోని యీ రెండు పద్యాలు లక్ష్మణుని ఉపాసనాస్వరూపాన్ని తెలియజేస్తాయి. లక్ష్మణుడు వదినగారిని మాతృస్వరూపిణిగా కొలిచాడు. అదే పూజ్యభావంతో, ఆమె పాదాలకు ఉభయసంధ్యలూ మ్రొక్కేవాడు. ఆయన ఉపాసన ఎంతటి నిర్మలమైనదంటే, లక్ష్మణుని దృష్టి ఎప్పుడూ తల్లి పాదాల మీద ఉండేది కానీ, ఆమె కాలి అందెల మీద ఉండేది కాదు. సూక్ష్మబుద్ధులైన పాఠకులకు యీ తారతమ్యం సులభంగానే గ్రాహ్యమౌతుంది.
ఈ పద్యాలు, భాగవతంలోని ప్రహ్లాదుని సౌశీల్యాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాయి.
" కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన, మాతృభావము జేసి మరలువాడు. "
No comments:
Post a Comment