వీడెవడో మహాసురుఁడు వీనిని ఱొమ్మున వ్రక్కలించెదన్
బోఁడిమిమాలినట్లనుచు బొంయిన మారుతి గాడ నేయఁగాఁ
జూఁడిన ప్రస్థమై పగులుసూపెను శైలము వాయుఁసూతి య
వ్వాఁడిమి లోనెఱింగి గిరిబాలుఁడు సంతసమందె నెంతయున్.
అంతన్ మానుషరూపమంది గిరి యిట్లాడెన్ మహాశూరుఁడా !
చింతంబొందకు మేను శత్రువని యక్షీణ ప్రభావంబునం
జింతాకంతయు నిల్వఁజాలని వియత్సీమన్ జన న్నీవు వి
శ్రాంతిం బొందెద వచ్చు వచ్చితి మహాస్మత్కూట దేశంబులన్.
హనుమంతుడు ఆకాశమార్గంలో సముద్రము మీదుగా ప్రయాణం చేస్తున్నాడు. ఇది చూసిన సముద్రుడు అతనికి ఏదన్నా సహాయం చెయ్యాలనుకొన్నాడు. సముద్రగర్భంలో దాగి, తన రక్షణ పొందుతున్న హిమవంతుని కొడుకు, మైనాకుడనే పర్వతాన్ని, హనుమంతుడు కొంచెం సేపు విశ్రాంతి తీసుకొనటానికి, సముద్రము లోనుంచి పైకి లేవమన్నాడు. మైనాకుడు తన ఉన్నతమైన శిఖరాలతో పైకి లేచాడు. మహావేగంగా వస్తున్న హనుమ అది చూసి ఇలా అనుకున్నాడు.
" వీడెవడో పెద్ద రాక్షసుడిలాగా ఉన్నాడు. వీడి వక్షస్థలం బద్దలై, రూపురేఖలు మారేటట్లుగా , వీడి రొమ్ములో ఒక్క గుద్దు గుద్దుతాను. " , అనుకొంటూ, వాయునందనుడు మైనాకుడి వక్షస్థలంలో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు, అంతటి మహాపర్వతం యొక్క చరియలు పగుళ్ళు చూపాయి. హనుమంతుడి దెబ్బ తీవ్రతకు ఆ గిరిబాలకుడు, మైనాకుడు లోలోపల చాలా సంతోషించాడు.
మైనాకుడు మానవరూపం ధరించి, హనుమంతుడితో ఇలా అన్నాడు:
" ఓ మహాశూరుడా ! నీవేమీ బాధ పడవద్దు . నీవు అంతులేని ఆకాశవీధిలో అలుపనేది లేకుండా మహావేగంతో వెళ్తుంటే, నా కొండచరియల మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటావని పైకి వచ్చాను. "
పూర్వం పర్వతాలు రెక్కలతో ఆకాశంలో స్వేచ్ఛావిహారం చేసేవి. దానికి ఇంద్రుడు కోపించి, పర్వతాల రెక్కలను తన వజ్రాయుధంతో తెగకోశాడు. హిమవత్పర్వతం కొడుకు, మైనాకుడు భయపడి, సముద్రుని రక్షణ కోరి, సముద్రగర్భంలో తలదాచుకొన్నాడు. ఇప్పుడు, తాను పొందిన ఉపకారానికి ప్రతిగా, సముద్రుని కోరిక మేరకు, హనుమంతునికి ఆతిథ్యమివ్వటానికి సముద్రగర్భం నుండి పైకి వచ్చాడు. హనుమంతుడి చేతి దెబ్బ రుచి చూసిన మైనాకుడు, హనుమ అరివీరభయంకరుడని, అజేయుడని, అనుకున్న పనిని తప్పక సాధిస్తాడని లోలోపల సంతోషించాడు.
ఈ రెండు పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment