అమ్మ! సమాధిలో నిటలమందున వేల్పులువచ్చి నన్ను రా
జ్యమ్మును జేయవద్దనిన యట్లయి తోఁచిన నేమి తోఁచ కే
నిమ్మెయి వచ్చితిన్ నిజ మదేమియొ నాకునుగూడనట్లె రా
జ్యమ్మునయందుఁ గోర్కియనునట్టిది గుండియఁబట్టి లేదునున్.
అనినన్ గైకయి యిప్పుడట్లెయగు ఱేపంకస్థయౌ జానకిం
గని సింహాసనసీమ వేఱొకగతిన్ గన్పించుఁ బొమ్మన్న రా
ముని నేత్రంబుల నొక తీవ్రకళయై మున్నీవు నువ్వెత్తు నే
ర్పిన కోదండకళావిచిత్రగమనశ్రీ యేమగుం జెప్పవే !
తెల్లవారితే పట్టాభిషేకం. ఆ రాత్రి రాముడికి సమాధి స్థితిలో, దేవతలు వచ్చి, పట్టాభిషేకం చేసుకోవద్దన్నట్లు అనిపించింది. వెంటనే అతడు పినతల్లి కైకేయి వద్దకు వెళ్ళి ఇలా ఆన్నాడు.
" అమ్మా ! నేను సమాధి స్థితిలో ధ్యానమగ్నుడినై ఉండగా, భ్రూమధ్యంలో, దేవతలు వచ్చి నిల్చొని, నన్ను రాజ్యం చేయవద్దన్నారు. నాకేం చెయ్యాలో తోచలేదు. పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను. అదేమిటో, నిజంగా నాకు కూడా అట్లాగే అనిపిస్తున్నది. రాజ్యం చేయాలన్న కోరిక నా మనసుకు పట్టడం లేదు. "
ఈ మాటలు వినగానే, కైక " ఇప్పుడట్లాగే అనిపిస్తుందిలే. రేపు సింహాసనం మీద చిట్టితల్లి సీత ప్రక్కన కూర్చొన్నప్పుడు ఇంకొక రకంగా అనిపిస్తుందిలే. ఇక చెప్పింది చాలు పో. " అన్నది.
అనగానే, రాముని కళ్ళలో ఒక తీవ్రమైన భావం మెరుపులా మెరిసి, " మరింతకాలం నువ్వు నేర్పించిన, ధనుర్విద్యా పాండిత్యమంతా ఏం కావాలో, అది కూడా చెప్పు. " అని నిలదీసాడు..
ఈ రెండు పద్యాలను పరిశీలిస్తే, ప్రేమాస్పదయైన పినతల్లి కైక మాతృహృదయమనే పాలపొంగు మీద, రాముని మాటల వెనుక అంతర్లీనంగా ఉన్న కార్యకారణ సంబంధమనే నీళ్ళు చల్లినట్లయింది.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోని యీ పద్యాలు, రామకథను క్రమక్రమంగా అవతారలక్ష్యం వైపు నడిపిస్తూ, కైకేయీపాత్ర చిత్రణలో క్రమపరిణామానికి నాంది పలుకుతున్నాయి.
No comments:
Post a Comment