అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః
న సన్న్యాసీ చ యోగీ చ న నిర్వగ్ని ర్నచాక్రియః
ఫలము నాశింపకయె, కర్మములను జేయు
నాతడే యోగి, మరియు సన్యాసి యతడె !
అగ్నిహోత్రక్రియల మాని నంతమాత్ర
నాతడు, యోగియె కాడు, సన్యాసి కాడు.
శ్రీమద్భగవద్గీత లోని ఆరవ అధ్యాయానికి " ఆత్మ సoయమ యోగ " మని పేరు. ' ఆత్మ ' అన్న పదానికి శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరిస్వామివారు మూడు అర్థాలను చెప్పారు. ' ఆత్మ సాక్షాత్కారము ' అన్న పదబంధంలో ఆత్మ అనే పదం పరమాత్మను సూచిస్తుంది. ' ఆత్మ సంయమం ' అన్న పదబంధానికి మనస్సును నియంత్రిచడం అని అర్థం. ' ఆత్మహత్య ' అన్న పదంలో బలవన్మరణం అనే అర్థం వస్తుంది. ఈ అధ్యాయంలో ' ఆత్మ సంయమం ' అంటే ఇంద్రియాలను, తద్వారా మనస్సును అదుపులో పెట్టడం అని అర్థం.
' ఆత్మ సంయమ యోగం ' లో ఇది మొదటి శ్లోకం. సాంఖ్య యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం, కర్మ సన్యాస యోగం అనే అనే మార్గాలన్నీ పరమాత్మ దర్శనానికి ఉద్దేశించినవే నని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు, మొదట ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించటం సాధకునికి సులభమైన మార్గమని చెప్పాడు.
ఈ అధ్యాయంలో భగవానుడు ఇంద్రియాలను విషయాల వైపు పోకుండా నిగ్రహించటం, తద్వారా మనస్సును నియంత్రించటం గురించి చెపుతున్నాడు.
" అర్జునా ! ఎవడైతే ఫలాపేక్ష లేకుండా కర్మలను చెస్తాడో, అతడే నిజమైన యోగి, నిజమైన సన్యాసి. అంతే కానీ, అగ్ని కార్యాన్ని మానివేసి, నిత్య, నైమిత్తిక కర్మలను మానివేసినవాడు సన్యాసి కాడు. "
లోకంలో, కాషాయ వస్త్రాలను కట్టుకొని, ఆశ్రమాలను స్థాపించి, శిష్యగణాన్ని పోగుచేసుకున్నవాడు సన్యాసిగా పరిగణింపబడుతున్నాడు. లేకపోతే, జనసంచారానికి దూరంగా ఏ పర్వత ప్రాంతాలలోనో, కొండగుహల లోనో ముక్కుమూసుకొని తపస్సు చేసుకొనేవాడు యోగి అని అనుకుంటారు. కానీ, యదార్థం అది కాదు. బాహ్యవేషధారణ సంగతి అట్లా ఉంచి, రాగద్వేషాలను విడిచి, ద్వంద్వాతీతుడై, సంగాన్ని విడిచినవాడు నిజమైన యోగి, సన్యాసి అనబడతాడని కృష్ణభగవానుడు సుస్పష్టంగా చెప్పాడు.
ఈ శ్లోకంలో ' కార్యం కర్మ కరోతి ' - చేయవలసిన పనులను చేయాలి, ' అనాశ్రితః కర్మఫలం ' - ఫలాపేక్ష లేకుండా చేయడం - అనేవి సన్యాసి, యోగి లక్షణాలని చెప్పాడు. అంటే, ధర్మకార్యాలను, శాస్త్రం విధించిన కార్యాలను తప్పకుండా చేసితీరాలి. లేకపోతే అది సోమరితనం, నిర్వ్యాపారత్త్వం, పని నుండి తప్పిచుకొనడం అవుతుంది. ఇది నిజమైన సన్యాసి లేక యోగి లక్షణం కాదు. సంగమును విడిచినవాడే నిజమైన యోగి, సన్యాసి అని భగవానుడు చెబుతున్నాడు.
అందువల్ల, చేయవలసిన పనులను తప్పకుండా చేస్తూ, వాటి ఫలితాలను ఆశించకుండా, సంగవివర్జితుడైనవాడు నిజమైన యోగి, సన్యాసి అని అర్థ మవుతున్నది.
No comments:
Post a Comment