మానుషమైన రూపము సమంజస గౌరవభావమంతఁ దా
నూనిన సూర్యసూతి మఱియున్ మృదులోచన మందహాసుడై
తానుగ నంజనాసుతుడు తమ్ము బుజంబుల మోసి తెచ్చిన
నేనును దెచ్చినట్లె యగు నీరజపత్రవిశాలలోచనుల్.
హనుమ వచించె నీ సకలమైన కథావిషయంబు తోడఁ ద
మ్మునిఁ గొనివచ్చి నిల్చితివి ముంగిట నేస్తము గోరి, నేను రా
జని తొలుదొల్త రాచబిగువైనను చేయవు నిన్ను మించి నా
యునికియు లేదు రాజ్యమును నుగ్మలి లేరనుటన్ సమానుడన్.
వాగర్థభూతబుద్ధి
స్థాగూ సమదీపితాంతరానందాస్యా !
నా గడప త్రొక్కి తనుటకు
నే గడపయు లేని నే నదేమనఁగలనో.
హనుమంతుడు రామలక్ష్మణులను తన బుజాలపై నెక్కించుకొని సుగ్రీవుని సన్నిధికి తీసుకువచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు మానవరూపం ధరించి, గౌరవభావంతో, ప్రసన్న నేత్రాలతో, మందహాసవదనంతో, రామలక్ష్మణులతో ఇలా అన్నాడు.
" పద్మ పత్రముల వంటి కన్నులు కల రామలక్ష్మణులారా! ఆంజనేయుడు మిమ్మల్ని తన బుజాలపై నెక్కించుకొని ఇక్కడకు తీసుకు వచ్చినా, నేను తీసుకువచ్చినట్లే భావించండి. హనుమ మీకు సంబంధించిన అన్ని విషయాలు నాతో చెప్పాడు. తమ్ముడిని నీతో తీసుకొని వచ్చి, నాతో మిత్రత్వాన్ని కోరుతున్నావని చెప్పాడు. రాచబిడ్డవైనా ఏమాత్రం బింకం చూపించకుండా వచ్చావు. నీవు లేకపోతే నేను లేను, నా రాజ్యం లేదు, నా భార్య లేదనటం నిజం.
రామా ! మాట, మాటతో పాటు అర్థం సమన్వయం చేస్తూ మాట్లాడే, ఆనందం ఉట్టిపడే ముఖదీప్తి కలవాడవు నీవు. ఇప్పుడు నా స్నేహాన్ని కోరి వచ్చావు కనుక, నా గడప త్రొక్కావనటానికి, నేనిప్పుడు ఏ గడప (ఇల్లూ వాకిలి) లేనివాడిని కదా! ఇంతకంటె ఏం చెప్పగలను? "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండములోని ఈ పద్యాలలో వ్యక్తమైన రామసుగ్రీవుల కలయిక, మైత్రీబంధం ఒక కరుణరసాత్మక ఘట్టం. " నా గడప త్రొక్కితనుటకు, నే గడపయు లేని నే నదేమనగలనో " అన్న సుగ్రీవుని మాటలు, అతని దైన్యస్థితిని సూచిస్తూ, పాఠకుని హృదయపు లోతుల లోనికి చొచ్చుకుపోతాయి.
No comments:
Post a Comment