ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మ్నః ||
తన్ను దా నధోగతి నందంగ నీక
దాన్ను దా నుద్ధరించుకో దగును ధరణి
ఏలనన, దన కాత్మయె హితుడు మరియు
నాత్మయే మహాశత్రువు నగును గాన. ||
శ్రీమద్భగవద్గీత, ఆత్మ సంయమ యోగం లోని ఐదవ శ్లోక మిది.
ఇందులో భగవానుడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని స్పష్టం చేశాడు. నారద భక్తి సూత్రాలలో " స తరతి తరతి, లోకాం స్తారయతి " అని చెప్పాడు. అంటే, ఎవరికి వారు తరిస్తే, తద్వారా లోకాన్ని తరింప జేయవచ్చునని భావం. ఆత్మోద్ధరణ చాలా ముఖ్యం. మనలో చాలా మంది లోకం బాగా చెడిపోయిందని చెబుతూ ఉంటారు. లోకమంటే మనమే కదా ! మన0 ఈ లోకం లోని వ్యక్తులం. ప్రతి వ్యక్తి తనకు తానుగా ధర్మాన్ని ఆచరిస్తే, అది చక్కని కుటుంబ వ్యవస్థ నేర్పరుస్తుంది. అటువంటి చక్కని కుటుంబాలు, చక్కటి సమాజాన్ని, ప్రపంచాన్ని నిర్మిస్తాయి. భగవానుడు చెబుతున్నాడు.
" అర్జునా ! ఎవరికి వారు తమను తామే ఉద్ధరించుకోవాలి. తమను తాము అధోగతి పాలు చేసుకోగూడదు. ఎందుకనగా, మానవుడు ఇంద్రియజయం సాధించి నపుడు, తనకు తానే బంధువవుతాడు. ఇంద్రియాలకు లోబడి విషయవాంఛలకు గురైతే, తనకు తానే శత్రువౌతాడు."
దీనినే ఉపనిషత్తు " మనయేవ కారణం బంధ మోక్షామి ఏవచ ( బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సు కారణం) " అని చెప్పింది. మనస్సు ఇంద్రియాలను తనవైపుకు తిప్పుకొని, విషయవాంఛలకు గురిచేస్తుంది. అదే మనస్సును నియంత్రించి, ఇంద్రియనిగ్రహం సాధిస్తే, అది మానవుణ్ణి ఈ సంసారం నుండి బంధవిముక్తుడిని చేస్తుంది. అందువల్ల, మనోజయం కలగాలంటే, ఎవరికి వారుగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలని, స్వస్వరూపాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నాడు భగవానుడు.
సుమతి శతకకారుడు కూడా పై విషయాన్ని, "
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ
అని చెప్పాడు.
అందువల్ల, మానవుని శుద్ధాంతఃకరణమే ఉద్ధారకుడు, బంధువు, కల్మషహృదయమే పతనకారకుడు, శత్రువు అని గ్రహించాలి.
No comments:
Post a Comment