నృపుఁడును భీష్ముఁడుం గృపుఁడు నీవు గురుండును దత్సుతుండు ను
గ్రపు బలమేచి తో నడవఁగా బెనుదాడిగఁ బోయి మత్స్య నా
థుపసులఁ బట్టి యద్దొరలతోఁ జెడి పాఱితి కర్ణ ! యప్డు క
య్యపు బలుపాడె, దిప్డు మన యర్జును నమ్ములు ద్రుప్పు వట్టెనే?
ముందరియట్లుగాదు, జనముల్ దెగడన్ వెఱ బాఱ నేడు సం
క్రందనసూతి మార్కొని తిరంబయి పోరెద, దాఁపఁ బ్రాణముల్,
నిందకుఁ జాల నింక నను నిక్కపుఁ బల్కులు పల్కు టొప్పు, దా
నం దుదిఁ జచ్చినం జను, మొనన్ నరుఁ దాఁకుట రిత్త వోవునే?
సంక్రందనసూతి = ఇంద్రుని కొడుకు, అర్జునుడు.
శల్యుడు కర్ణుడిని సూటిపోటి మాటలతో నిరుత్సాహ పరుస్తున్నాడు. అవి కర్ణుడి పాలిట శరాఘాతాలుగా మారుతున్నాయి. ఆయన ఏమంటున్నాడో చూడండి.
" ఓ కర్ణా ! అప్పుడు దుర్యోధనుడు, భీష్ముడు, కృపాచార్యుడు, నీవు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ మదలైన వారంతా పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని వెళ్ళి విరాటరాజు పశువులను పట్టుకొని, తరువాత యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడి పారిపోయారు కదా ! ఇప్పుడు యుద్ధోత్సాహంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అర్జునుడి బాణాలేమన్నా తుప్పు పట్టాయనుకుంటున్నావా ఏమిటి?
నువ్వు ఇంతకుముందు లాగా ఇప్పుడు పారిపోవటానికి కుదరదు. ప్రజలు నిన్ను ఛీ కొడతారు. ప్రాణాలకు తెగించి అయినా పోరాడతానని అన్నావు. ఇంతటి అపనింద మోయటం కన్నా యుద్ధంలో చావటం మేలన్నావు. నువ్వు చెప్పిందంతా నిజమే. ఆ విధంగా యుద్ధంలో చివరికి చచ్చిపోయినా మాట నిలబెట్టుకొన్నట్లే అవుతుంది. కానీ, అర్జునుడితో యుద్ధమంటే ఊరకే అవుతుందనుకుంటున్నావా? "
కర్ణుడు మహావీరుడైనప్పటికీ, శాపొపహతుడు, దైవోపహతుడు. దానికి తోడు శల్యుని మాటలు అతడిని క్రుంగదీస్తున్నాయి. భారతంలో కర్ణపర్వ మంతా ఒక విషాదాంత నాటకాన్ని తలపిస్తుంది.
" మన అర్జును నమ్ములు ద్రుప్పు వట్టెనే? " అనటంలో శల్యుని పక్షపాతబుద్ధి స్పష్టమౌతున్నది. " త్రుప్పె వట్టెనే? , రిత్త వోవునే? వంటి అచ్చ తెలుగు పదాలు పద్యం ముగింపుకు అందాన్ని తెచ్చిపెట్టాయి.
ఈ రెండు పద్యాలు శ్రీమదాంధ్ర మహాభారతము, కర్ణపర్వం, ద్వితీయాశ్వాసం లోనివి.
No comments:
Post a Comment