కారుణ్యాత్మకు నిన్ను మానవు డెదం గామించి సేవించి దు
ర్వారాపారసుఖంబు, నుత్తమగుణవ్రాతంబు, సత్కీర్తియుం,
బారావార పరీత భూతలము నిర్బాధంబుగా నేలు వి
స్తారైశ్వర్యము బొందు నీ దయ మహిన్ దారిద్ర్యవిద్రావణా !
శివుడు దయాసముద్రుడు. అందుకే, ఆయనను బోళా శంకరుడంటారు. ఆయన దయ ఉండాలి గాని, దేనికీ లోటుండదు. ఆయనకు కరుణ కలిగితే, ఎవరూ అడ్డగంచలేని సుఖాల నిస్తాడు. సద్గుణాలను ప్రసాదిస్తాడు. మంచి కీర్తి సంపద నిస్తాడు. నాలుగు సముద్రాలచే చుట్టబడిన భూమండలాన్ని ఏ మాత్రం బాధ లేకుండా ఏలుకొనేటట్లు చేస్తాడు. ఇంతెందుకు. ఆయనకు ఎవరి మీద దయ కలిగితే, వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు.
భక్తుడు చేయవలసిందల్లా ఒక్కటే. ఆ పరమశివుడిని నిర్మలమైన హృదయంతో కోరుకొని, సేవించాలి.
లోకంలో, కామోపహతుడు అన్నీ మరచిపోతాడు. ఆ కామానికి అవధి అంటూ ఉండదు. పరమాత్మను అలౌకిక బుద్ధితో అంతగా కామించాలి, సేవించాలి.
పోతనగారు ప్రహ్లాదచరిత్రలో " ఎందెందు వెదకి చూచిన " అన్నారు. పరమాత్మను పొందాలంటే సర్వాత్మలయందు వెదకాలి, దివ్యచక్షువుతో చూడాలి. అదే విధంగా, శివుణ్ణి పొందాలంటే, ఆయనను కామించాలి, సేవించాలి. ఆయనతో తాదాత్మ్యం చెందాలి.
నన్నెచోడుని ఈ పద్యం కుమార సంభవము, దశమాశ్వాసం లోని బృహస్పతికృత ' దారిద్ర్యవిద్రావణ స్తవంలో ' ఉన్నది.
No comments:
Post a Comment