తన కుసుమంబులన్ ఫలవితానము మూర్కొన నాన మ్రాను నే
రని క్రియ గాన నేరదు పరం బగు తత్త్వము నైజభంగి వి
న్ననువున నంతరాత్మ గను నైష్ఠికతం గను; మింతవట్టు బా
మెనసిన తోలు వాయుక్రియ నీవు దొఱంగుదు పాపపుంజమున్.
వేదవ్యాసుడు తన కుమారుడైన శుకునికి సర్వవేదాంతశాస్త్ర సారమైన ' అధ్యాత్మ విద్యను ' బోధించి, ఆత్మజ్ఞానాన్ని యెవరికి వారుగా పరమ నిష్ఠతో సాధిచుకోవాలని చెపుతున్నాడు.
" చెట్టు తన పూలను తాను వాసన చూడలేదు. తన పండ్లను తానే తినలేదు. అదే విధంగా, తత్త్వం తన స్వరూపం తాను గ్రహించలేదు. సాధకుడు అత్యంత శ్రద్ధతో, నేర్పుతో ఆత్మదర్శనం చేయాలి. అందుచేత, నిష్ఠాపరత్వంతో, ఇంద్రియ నిగ్రహంతో దీనిని సాధించు. అప్పుడు, పాము కుబుసం విడిచినట్లు, నీవు పాపవిముక్తుడివౌతావు. "
భగవంతుడైన శ్రీకృష్ణుడు ' అన్ని విద్యలలో తాను అధ్యాత్మవిద్య ' నని భగవద్గీతలో చెప్పాడు. అధ్యాత్మవిద్య యొక్క పరమ రహస్యం తనను తాను తెలిసికొనడమే. ఏది నిత్యమో, అఖండమో దానిని గ్రహించి అశాశ్వతమైన, క్షణమాత్రమైన ఇంద్రియసుఖాలను త్యజించటం. అంతరింద్రియ నిగ్రహం ద్వారానే ఆత్మతత్త్వాన్ని తెలుసుకొనడం సానుకూలపడుతుంది. దీనిని ఒక చక్కని ఉపమానంతో విశదపరిచాడు వ్యాసుడు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వము, పంచమాశ్వాసము లోనిది.
No comments:
Post a Comment