ఉద్యద్గంధగజేంద్ర గౌరవముతో యోషాంబరంబుల్ విభుం
డాద్యుం డర్భకు భంగి నర్భకులతో హాసార్థియై కొంచు ద
న్నద్యంభఃకణ శీతవాత జనితానందంబుతో దా
సద్యోముక్త దురంత పాదప జనుస్సంతాపమున్ నీపమున్.
నందగోకులంలోని గోపికలు నెలరోజులపాటు కాత్యాయనీ వ్రతం చేసుకొన్నారు. అందులో, ఒకరోజున పొద్దున్నే లేచి, కృష్ణుడి పాటలు పాడుకొంటూ యమునానదికి వెళ్ళారు. అక్కడ, జనసంచారం లేని ప్రదేశం చూసి, జంకుగొంకు లేకుండా బట్టలు విప్పి, నిర్మలమయిన మనస్సుతో, నదీజలాల్లో స్నానం చేయడానికి దిగారు. ఆ సంగతి తెలిసికొని, కృష్ణుడు ఎక్కడో దూరంగా ఉన్నా కూడా, తన స్నేహితులందరితో కలిసి అక్కడికి వచ్చాడు. కదలవద్దని మిత్రులందరికీ చెప్పి, చప్పుడు చేయకుండా వెళ్ళి, ఆ చీరలన్నిటినీ ఎత్తుకొచ్చి, దగ్గరలో ఉన్న ఒక కడిమి చెట్టెక్కాడు.
ఆ మధురదృశ్యాన్ని అక్షర రమ్యంగా పోతనగారు శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమస్కంధంలో వర్ణించారు.
" గోపికావస్త్రాపహరణం చేసిన చిన్నికృష్ణుడు, కుంభస్థలంలో మదజలం ఊరుతున్నప్పుడు గజరాజు గంభీరంగా, మెల్లగా ఎట్లా నడుస్తాదో ఆ విధంగా నడవటం మొదలుపెట్టాడు. ఏమీ తెలియని పిల్లవాడిలాగా, తోటిపిల్లలను కలుపుకొని, కాసేపు గోపికలను నవ్వులాట పట్టిద్దామనుకొన్నాడు. అంతే. వాళ్ళు కేరింతలు కొడుతూ స్నానం చేస్తున్నప్పుడు పడే నీటి తుంపరల చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, చీరల నెత్తుకొని వెళ్ళి, దగ్గరలో ఉన్న కడిమి చెట్టెక్కాడు. ఆహా ! కడిమి చెట్టు ఎంత అదృష్టం చేసుకుందో కదా! చరింపలేనటువంటి వృక్షజన్మ నెత్తిన దుఃఖమిక దానికి లేదు కదా ! "
భగవంతుని పాదరేణువు తగిలితేనే ముక్తిని పొందేటటువంటి స్థితిలో, తన కొమ్మలపై కృష్ణుడు కూర్చొనే భాగ్యం కలిగిన కడిమిచెట్టుకి సద్యోముక్తి తథ్యం కదా!
పరమేశ్వరుడైన కృష్ణుడు విభుడు, ఆద్యుడు. ఈ విశ్వనికంతకూ ప్రభువు, సృష్టి స్థితి లయాలకు కారణభూతుడైనవాడు. ఆయన ద్వంద్వాతీతుడు.
No comments:
Post a Comment