ఓ యయ్య హంస రాజా !
డాయఁగవచ్చిన వశిష్ఠుఁడవు కావుగదా !
నా యెదలో నొక మధురిమ,
యాయన డగ్గరిన యప్పు డైనట్లయ్యెన్.
నా కాఠిన్యము నామె మెత్తనయునో నాళీకనాళాద ! యీ
నీకున్ నీవు వశిష్ఠుఁడైన యెడలన్ నిక్కంబెఱుంగంగనౌ
నే కాదా, జలరాశి సేనఁగొని నా యీ రాక వాక్రువ్వనౌ
లేకున్నన్ సతి యేమి యౌనొ మఱి రాలేదంచు నీపాటికిన్.
ఇమ్ముగఁ జూడలేదు నిను నెప్పుడు వే దిగినావొ యంతరి
క్షమ్ముననుండి చూచు నిముసంబున దోచితి బొండుమల్లిపు
ష్పమ్మన నొక్కడే తొలుతఁ జూచిన ఱెక్కవిదల్చితంతలో
ముమ్మరమౌచుఁ దెల్లవిసెపూ విడఁజారిన రేకవోలికన్.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండములోని హంసదౌత్యము ఒక అద్భుతమైన కల్పనాచమత్కృతి.
సాయంసంధ్యోపాసనానంతరం, శ్రీరామచంద్రుడు ఒక రాతిపై కూర్చొని ఉన్నాడు. ఆ తరుణంలో, తనకు సమీపంలో ఒక రాజహంస ఆకాశంలో పచార్లు చేయటం చూసాడు. రాజహంసను చూసిన మరుక్షణం నుంచి ఆయనలో పలు భావాలు రావటం మొదలుపెట్టాయి. శివుడే హంస రూపంలో, సీతకు రాముని విరహవేదనను తెలియచేయటానికి వచ్చాడనుకొన్నాడు. ఈ పద్యాలలో, రామునిలో ముప్పిరిగొన్న, ఇంకొన్ని పవిత్రభావాలను పరిశీలిద్ధాం.
" ఓ అయ్యా! రాజహంసా! నీవు నా దగ్గరకు వచ్చిన వశిష్ఠుడవు కాదు గదా ! ఎందువలనంటే, నువ్వు దగ్గరకు రాగానే వశిష్ఠులవారు దగ్గరకు వచ్చినప్పుడు కలిగే మధురభావమే నాకు కలిగింది సుమా !
హంసాధ్యక్షా ! నీవు వశిష్ఠుడవైతే, ఇది నా కఠినత్వమో, మరి జానకి మెత్తదనమో, నీకు తప్పకుండా తెలిసుండాలి. సముద్రాన్ని దాటి, సేనలతో నేను వస్తున్న సంగతి సీతకు తెలియకపోతే, ఆమె ఏమైపోతుందో కదా !
నిన్ను నే నెప్పుడూ సరిగా చూడలేదు. ఆకాశంలో నుంచి నువ్వు దిగుతున్నప్పుడు ఒక్క నిముషంసేపు మాత్రం నువ్వు నాకు తెల్ల బొండుమల్లెపువ్వులాగా కనిపించావు. ఇంతలో, నువ్వు రెక్కలు విదిల్చేటప్పటికి రేకులు విప్పిన తెల్ల అవిసెపూవులాగా అనిపించావు."
" మదికి ఉదాత్త కల్పనల మక్కువ" కలిగితే " విశ్వనాథ శారద, బహుళార్థదాయిని, సురద్రువు, రామకథ " ప్రసన్నమౌతుంది.
No comments:
Post a Comment