తాలిమి బేర్చు వారలును, ధర్మవిధిజ్ఞులు, సత్యవంతులున్,
లోలత లేనివారు, మదలోభ నిరర్ధక కోపహీనులు
న్శీల సమేతులుం బలుకనేర్చుట కార్యము కాన్పు పెంపుమై
జాలుట గల్గు భృత్యులును సంపద సేయుదు రాత్మభర్తకున్.
ధర్మరాజుకు ధర్మార్థకామమోక్షాలను గురించి వివరణ పూర్వకంగా చెప్పాడు భీష్ముడు. తరువాత, ధర్మరాజు భీష్ముడిని రాజుకి కావలసినవారు ఎవరు, అక్కరలేనివారు ఎవరు అని అడిగాడు. దానికి సమాధానమే శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వం, తృతీయాశ్వాసంలోని యీ పద్యం.
" ఓర్పు కలిగినవారు, ధర్మశాస్రాలు చక్కగా తెలిసినవారు, సత్యం పలికేవారు, చంచలస్వభావం లేనివారు, గర్వము, పేరాశ లేనివారు, కారణం లేకుండా కోపం తెచ్చుకొననివారు, శీలసంపద కలిగినవారు, వాక్చాతుర్యం ఉన్నవారు, పని మీద శ్రద్ధ కలిగి, అనుకూలంగా ఉండే సేవకులు, యజమానికి సంపదలు కలిగిస్తారు. "
పైన చెప్పిన గుణాలన్నీ ధర్మరాజులో ఉన్నాయి. అందువల్లనే, సేవలందుకొనడం తప్ప సేవించటం తెలియని ధర్మనందనుడు విరాటరాజు కొలువులో సేవాధర్మాన్ని నిర్వర్తించగలిగాడు.
No comments:
Post a Comment