తెలుగు పద్యానువాదం: శ్రీ లొల్లా సుబ్బరామయ్యగారు
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||
ఆత్మ జయించి యింద్రియములన్నిటి గెల్చిన యట్టి యవ్విశు
ద్ధాత్ముడు, యోగయుక్తమతియై మహియందు సమస్తమైన భూ
తాత్ముని, నాత్మగాంచు మహితాత్ముడు, కర్మలజేయుచున్న బ
ద్ధాత్ముడు గాడు కర్మల యదార్థము జుమ్మిది పాండునందనా !
ఇది శ్రీమద్భగవద్గీత కర్మ సన్న్యాస యోగం లోని ఏడవ శ్లోకం. దాని క్రింద పద్యం శ్రీ లొల్లా సుబ్బరామయ్యగారి ఆంధ్రానువాదం.
భగవంతుడైన శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.
" నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేవాడు, శుద్ధాంతఃకరణ కలవాడు, మనోజయం సాధించినవాడు, ఇంద్రియనిగ్రహం కలిగినవాడు, అన్ని ప్రాణుల యందు తనను, తన యందు అన్ని ప్రాణులనూ చూడ కలిగినవాడు, కర్మలను చేసినా కూడా, ఆ కర్మఫలాలు తనను అంటవు. "
ఈ శ్లోకంలో భగవానుడు, కర్మబంధాలు అంటకుండా ఉండాలంటే, జీవుడు ఐదు లక్షణాలను కలిగి ఉండాలని చెప్పాడు. అవి, నిష్కామ కర్మ, శుద్ధాంతఃకరణ, మనోజయం, ఇంద్రియనిగ్రహం, సర్వభూతముల యందు ఏకాత్మ భావన.
కర్మలను ఆచరిస్తూ, ఆ కర్మఫలాలని ఆశించనివాడు ద్వంద్వాతీతుడై ఉంటాడు. ఆ కర్మలను ఆచరించటం వలన వచ్చే సుఖదుఃఖాలు, మానావమానాలు అతనిని అంటవు. అట్లా నిష్కామ కర్మాచరణకు నిర్మలహృదయం కలిగి ఉండాలి. అప్పుడు, మనస్సు కలిగించే పోకడలను నిరోధించి, ఇంద్రియాలను నిగ్రహించ గలిగి, విషయవ్యాపారాలకు అడ్డుకట్ట వేయగలుగుతాడు. ఈ విధంగా ఇంద్రియాలపై పట్టు సాధించి, మనోజయం పొందాలంటే, " నేను, నాది " అనే భేదం నశించి, తనలో ఏదైతే ఆత్మ ప్రకాశిస్తూ ఉందో, అన్ని ప్రాణులలోను అదే ఆత్మతత్త్వం ప్రకాశిస్తూ ఉందనే భావం కలగాలి. విష్ణు భక్తుడైన ప్రహ్లాదునికి ఈ భావం కలిగి, " తనయందు అఖిలభూతము లందు సమహితత్త్వం " కలిగింది కాబట్టే, అతడిని పర్వతాగ్రం నుంచి క్రిందికితోసినా, పాముల చేత కరపించినా, ఏనుగుల చేత త్రొక్కించినా, చివరకు కాలకూట విషాన్ని తాగించినా, అవి అతడిని ఏమీ చేయలేకపోయాయి. అతడికి విశ్వమంతా విష్ణుమయమే.
ఇదే జ్ఞానమంటే. ఈ ఎఱుక కలవాడు నిజమైన తత్త్వదర్శనుడు. తనను తాను తెలుసుకున్నవాడు. ఇదే, భగవానుడు అర్జునుని మిషతో మానవాళి కిచ్చిన దివ్యసందేశం.
No comments:
Post a Comment