న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామస్సర్వే వయమతః పరం.
నేను గాని నీవు గాని యొకప్పుడు
ఈ నృపాలురైన గాని ధరను
లేని వారమనుట లేనే లేదిక మీద
లేక పోదుమనుట లేనె లేదు !
పండితులు, అనగా, జ్ఞానులు, మరణించిన వారిని గురించి గాని, బ్రతికియున్న వారిని గురించి శోకింపరని భగవానుడు చెప్పాడు.
సాంఖ్యయోగం లోని యీ పన్నెండవ శ్లోకంలో, పైన చెప్పిన దానిని కొంచెం వివరంగా చెబుతున్నాడు కృష్ణభగవానుడు..
" అర్జునా ! నేను గాని, నీవు గాని, యుద్ధరంగానికి వచ్చిన వివిధ దేశాల యీ రాజులు గాని, ఒకప్పుడు లేకపోయినవారు గాని, ఇక ముందు లేకుడా ఉండేవారు గాని కారు. "
శ్రీకృష్ణుడు ఇక్కడ అధ్యాత్మవిద్యలో సారభూతమైన స్వస్వరూప జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. " నేను, నీవు, యీ రాజులు " అని ముందు చెప్పి, అందరూ సమానమే నన్న భావాన్ని అర్జునుని హృదయంలో నాటాడు. ఆ తరువాత మెల్లగా, పైన చెప్పినవారంతా " గతంలో లేకపోవటం గాని, ఇక ముందు ఉండకపోవటం గాని లేదు " అని చెప్పటం వల్ల, అది అజ్ఞానం వల్ల కలిగిన భావమే కానీ, సత్యం కాదని, ఆత్మనిత్యత్వ స్థాపనకు చక్కటి బాట వేసాడు.
ఈ శ్లోకం ఛాందోగ్యోపనిషత్తు నందలి " తత్త్వమసి ( నీవు అది అయి ఉన్నావు) అనే మహావాక్యానికి వివరణ వంటిది. భగవానుడు గాని, అర్జునుడు గాని, యుద్ధరంగంలోని రాజులు గాని, అందరూ ఆత్మస్వరూపులేనని, విడి విడిగా కనిపించే యీ నామరూపాలు ఉపాధిభేదాలని చెప్పకనే చెప్పాడు. జ్ఞానులకు తెలిసిన యీ పరమ సత్యం, అవిద్య (అజ్ఞానం) చేత అవివేకులు తెలుసుకోలేకుండా ఉన్నారు. అందువల్ల, అర్జునుని దుఃఖం అజ్ఞానం నుంచి పుట్టిందని శ్రీకృష్ణుని ఉపదేశ సారాంశంగా మనం భావించాలి.
No comments:
Post a Comment