నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత |
ఉభయోరపి దృష్టోన్తస్త్వనయో స్తత్త్వదర్శిభిః ||
లేని దానికునికి లేనె లేదిలలోన
నున్న దానికి లేమి యెన్న లేదు
ఈ ద్వయంబు తత్త్వ మెఱుగ గల్గినయట్టి
తత్వవిదులచేత దర్శితంబు.
లోకంలో అసద్వస్తువు, సద్వస్తువు అని రెండు రకాల వస్తువులను గురించి చెప్పుకుంటుంటాము. అసద్వస్తువు అంటే లేనిది, నశించేది. ఏదైతే పుడుతుందో, అది తప్పక నశిస్తుంది. శాస్త్రవిజ్ఞానం కూడా దీన్ని ధృవీకరించింది. ఇక సద్వస్తువుకు అంటే " ఉన్నది " , నాశనం లేనిది. అదే ఆత్మపదార్థం. ఈ రెండింటి యొక్క యదార్థ స్వరూపం తెలిసినవాడు " తత్త్వదర్శి " , జ్ఞాని.
ఈ విషయాన్ని భగవానుడు చెబుతున్నాడు.
" లేని దానికి ' ఉనికి ' , ఉన్నదానికి ' లేకుండటం ' లేదు. ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపం ఒక్క జ్ఞానికి మాత్రమే తెలుసు. "
ఈ కనపడే ప్రపంచంలోని ప్రతి వస్తువూ నశించేదే. కాబట్టి, అనిత్యములైనటువంటి వానిని ఉన్నాయనుకోవటం అజ్ఞాన మనిపించుకుంటుంది. ఇక ఏదైతే నిత్యమైనదో, దేహంతో పాటు నశించదో, అదే ఆత్మపదార్థం అనేది. అటువంటి ఆత్మకు లేకపోవడ మనేది లేదని భగవానుడు చెబుతున్నాడు. నిత్యమైన దానిని లేదనుకోవటం కూడా అవివేకమే. ఈ నిత్యానిత్య వివేచన కలిగినవాడు తత్త్వదర్శనుడు, యదార్థ వస్తుస్వరూపం తెలిసినవాడు. వానిని మనం జ్ఞాని అని పిలుస్తాం.
ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు " తత్త్వదర్శి " కి " తత్త్వవాది " కి ఉన్న తేడాను చక్కగా విడమరిచి చెప్పారు. తత్త్వదర్శి యదార్థజ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూసినవాడు. వారే ద్రష్టలు. తత్త్వవాదులు ఊరకే నోటితో చెప్పేవారు. తత్త్వదర్శినులకు నిత్యానిత్యవస్తు పరిజ్ఞానం బాగా ఉంటుంది. ఈ విషయాన్ని భగవానుడు " ఉభయోరపి (రెండింటి యొక్క) అన్న పదప్రయోగం ద్వారా విడమరిచి చెప్పాడు.
శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాల వంటి వాటికి అతీతంగా ఉండే సమదర్శినులే తత్త్వదర్శినులని భగవానుని భావం.
శ్రీమద్భగవద్గీత, సాంఖ్యయోగం లోని పదహారవ శ్లోక మిది. శ్రీ లొల్లా సుబ్బరామయ్యగారు దీనికి తెలుగులో పద్యానువాదం చేసారు.
No comments:
Post a Comment