కౌరవనాథ! కుంతియును గౌరవమొప్పగ వచ్చి కొల్చు గాం
ధారి నతిప్రయత్నమున ద్రౌపది తాను సుభద్రయున్ ముదం
బారగ నిత్యముం గొలుతు రక్కురువంశమహత్తరన్ మహో
దారములైన వస్తువు లుదాత్తత నిత్తురు వార లందఱున్.
కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయాన్ని వరించి, రాజ్యాన్ని చేపట్టిన పాండవులు ధృతరాష్ట్రుడి విషయంలో ఎట్లా నడుచుకున్నారని జనమేజయుడు వైశంపాయుడిని అడిగాడు. ఆ విధంగా అడగటంలో ' యశోమహితయగు గాంధారి ' అనటం వల్ల గాంధారి పట్ల, తరాలు గడిచినా కూడా మంచి అభిప్రాయం చెక్కుచెదరకుండా ఉన్నదని అర్థమౌతున్నది. జనమేజయుని ప్రశ్నకు , వైశంపాయనుడు సమాధానమిస్తూ, గాంధారి పట్ల కుంతి, ద్రౌపది, సుభద్రల ప్రవర్తనను వివరించాడు.
" జనమేజయ మహారాజా ! కుంతీదేవి తన గౌరవానికి భంగం కలుగకుండా గాంధారిని సేవించేది. ఇక ద్రౌపదీసుభద్రలు, చాలా జాగ్రత్తగా, నేర్పుతో, కురువంశ స్త్రీలలో పెద్దదయిన గాంధారికి సంతోషం కలిగే విధంగా మెలిగేవారు. వారందరూ, గాంధారికి విలువైన కానుకలు ఇచ్చేవారు. "
ఈ పద్యంలో ముగ్గురు స్త్రీలను పేర్కొనడం జరిగింది. వారు, కుంతి, ద్రౌపది, సుభద్ర. పుత్రశోకంతో కుమిలిపోతున్న గాంధారి వలెనే, పై ముగ్గురు కూడా పుత్రులను కోల్పోయినవారే. అయినా కూడా, వారందరూ గాంధారిని వారి వారి పద్ధతులలో సేవించారు. కుంతి ఇప్పుడు రాజమాత. ఆ గౌరవానికి తగ్గట్లుగా, తనకంటె పెద్దదయిన అక్కగారిని గురుస్థానంలో ఉంచి, కుంతీదేవి గాంధారిని సేవించింది. ఇక ద్రౌపది విషయానికి వస్తే, గాంధారికి, తన కడుపుకోతకు కారణమని భావించే ద్రౌపదిపై చాలా కోపం ఉండటం సహజం. అందువల్ల, ద్రౌపది, సహజమైన తన మంచితనం వల్ల సేవిస్తున్నా కూడా, తన భర్తలకు చెడ్డ పేరు రాకుండా, అతి ప్రయత్నంతో, జాగ్రత్తతో, నేర్పుతో, గాంధారిని సేవించవలసిన అవసరం యెంతైనా ఉన్నది.. సుభద్ర, మహావీరుడైన అభిమన్యుడిని కోల్పోయిన తల్లి. అయినా దుఃఖాన్ని దిగమ్రింగి, ఆమె గాంధారికి సంతోషాన్ని కలిగించేది. ఆమె వారసులే తరువాత రాజ్యాధికారాన్ని చేపట్టారు.
శ్రీమదాంధ్ర మహాభారతము, ఆశ్రమవాస పర్వము, ప్రథమాశ్వాసం లోని యీ పద్యం మహాభారతగత స్త్రీపాత్రల స్వభావస్వరూపాలను తెలుసుకొనడానికి ఉపకరిస్తుంది.
పై పద్యంలోని విశేషాంశాలను, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, ఆశ్రమవాసపర్వ వ్యాఖ్యానంలో చక్కగా పొందుపరచిన డాక్టరు ఎం. నాగభూషణం గారికి కృతజ్ఞతలు.
No comments:
Post a Comment