కొన్నిటి కంఠముల్ నులుపుఁ గొన్నిటి కాళులు ద్రుంచు నుగ్రతం
గొన్నిటి పక్షముల్ నఱకుఁ గొన్నిటి పొట్టలు వ్రచ్చు లీలమైఁ
గొన్నిటి నప్పళించుకొని కోలెముకల్ నుఱుమాడు, నిట్టు ల
య్యన్నిటి నయ్యులూకము రయం బెసఁగన్ వధియించె భూవరా !
పాండునరేంద్రనందనుల బాంధవపుత్రయుతంబుగాఁగ ను
ద్దండత నే వధింతు నని దర్పమెలర్పఁగ గౌరవాధినా
థుండు వినంగఁ బల్కితిని, దుర్దమ దోర్బలు లమ్మహాత్మకుల్
గండున బెట్టు పైఁ బడుట కార్యము గాదు తలంచి చూడఁగన్.
కోలెముకల్ (కోల + ఎముకల్) = వెన్నెముకలు
ఉలూకము = గ్రుడ్లగూబ
సంజయుడు ధృతరాష్ట్రునికి ఎప్పటికప్పుడు యుద్ధరంగంలో విశేషాలను చెబుతున్నాడు.
దుర్యోధనుడు తొడలు విరిగి పడి ఉండటాన్ని చూసిన అశ్వత్థామ తీవ్ర మనస్తాపం చెందాడు. కురురాజుకి ఇచ్చిన మాట ప్రకారం అపాండవం చేయాలని యోచిస్తున్నాడు. ఆ రాత్రి, కృపాచార్యుడు, కృతవర్మలతో కలిసి వెళ్ళి చాటుగా పాండవుల శిబిరంలోని మహోత్సాహాన్ని గమనించాడు. ఏం చేయాలో తోచక, ఒక మడుగు దగ్గరకు వెళ్ళి దాహం తీర్చుకొని, దగ్గరగా ఉన్న చెట్టు క్రింద ముగ్గురూ పడుకున్నారు. కృపుడు, కృతవర్మ నిద్రపోయినా కూడా, అశ్వత్థామకు ఆలోచనలతో నిద్ర పట్టక, చెట్టుతొర్రలో నిద్రిస్తున్న కాకులను చూస్తూ పడుకున్నాడు. ఇంతలో ఒక గ్రుడ్లగూబ ఆహారం కోసం వెతుకుతూ వచ్చింది. చెట్టుతొర్రలో నిద్రిస్తున్న కాకులను చూసింది. తన అవయవా లన్నింటినీ ముడుచుకొని, చప్పుడు చేయకుండా అక్కడకు వెళ్ళింది.
సంజయుడు గ్రుడ్లగూబ కావించిన మారణకాండను వివరిస్తున్నాడు.
" ధృతరాష్ట్ర మహారాజా! అట్లా వెళ్ళిన గ్రుడ్లగూబ కొన్ని కాకుల పీకలు నులిమింది. కొన్నింటికి కాళ్ళు విరగ్గొట్టింది. కొన్నిటి రెక్కలు కత్తిరించింది. కొన్నిటి పొట్టలు చీల్చింది. కొన్నిటి వెన్నెముకలు పొడిపొడి చేసింది. ఈ విధంగా గ్రుడ్లగూబ మారణహోమం చేసింది.
అది చూసిన అశ్వత్థామ, పాండవుల మీద పగ తీర్చుకోవడానికి ఒక ఉపాయం దొరికినందుకు చాలా సంతోషించాడు. గ్రుడ్లగూబ తనకు కర్తవ్యాన్ని ఉపదేశించిందనీ, ఆ పక్షి చేసినట్లుగానే తాను కూడా శత్రువులను నిద్రపోతూ ఉండగా చంపాలని నిశ్చయించుకున్నాడు.
అశ్వత్థామ తనలో ఇలా వితర్కించుకున్నాడు.
" పాందవులందరినీ, పిల్లలు, బంధువులతో సహా చంపుతానని కురురాజుకి మాట ఇచ్చాను. మహాత్ములైన పాండవులు అరివీర భయంకరులు. అందువల్ల మొండిగా వాళ్ళను ముఖాముఖి ఎదుర్కొనడం మంచిది కాదు. "
అశ్వత్థామకు పాండవులు ధర్మపరులని తెలుసు. అందుకే, వారి పరాక్రమాన్ని ఉగ్గడిస్తూ, వారు మహాత్ములని పేర్కొన్నాడు. అయితే, అశ్వత్థామకు మృతుడైన తన తండ్రి ద్రోణుని శిరస్సును ఖండించిన ధృష్టద్యుమ్నుని మీద చాలా కోపంగా ఉంది. దానికి తోడు, తొడలు విరిగి పడి ఉన్న కురుసార్వభౌముడి దీనావస్థ దుస్సహమయింది. అందుకనే ఇంతటి అమానుషాన్ని తలపోస్తున్నాడు.
పై రెండు పద్యాలు శ్రీమదాంధ్ర మహాభారతము, సౌప్తికపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నాయి
No comments:
Post a Comment