నన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి
నతిథు లేతేర నడికి రేయైనఁ బెట్టు
వలయు భోజ్యంబు లింట నవ్వారి గాగ.
తీర్థసంవాసు లేతెంచినారని విన్న
నెదురుగా నేగు దవ్వెంత యైన
నేఁగి తత్పదముల కెఱగి యింటికిఁ దెచ్చుఁ
దెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు
నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయుఁ
జేసి కూర్చున్నచోఁ జేరవచ్చు
వచ్చి యిద్ధరఁ గల్గు వనధిపర్వతసరి
త్తీర్థమాహాత్మ్యముల్ దెలియ నడుగు
నడిగి యోజన పరిమాణ మరయు నరసి
పోవలయు జూడ ననుచు నూర్పులు నిగుడ్చు
ననుదినము తీర్థసందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి.
ప్రవరుని భార్య కాశీ అన్నపూర్ణ వంటిది. అర్థరాత్రి సమయంలో నయినా, ఎంత మంది అతిథులు వచ్చినా సరే, అలసట అనేది లేకుండా, వారి కిష్టమైన వంటలను చేసి పెడుతూ ఉంటుందామె.
ఇక నిత్యాగ్నిహోత్రుడైన ప్రవరు డెటువంటి వాడు?
పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ, ఎవరైనా ఊళ్ళోకి వచ్చారని చెప్పగానే, ఎంతదూరమైనా సరే, వాళ్ళకు ఎదురువెళ్ళి తీసుకువచ్చేవాడు. తీసుకువచ్చి, వాళ్ళకు నమస్కరించి, అర్ఘ్యపాద్యాలిచ్చి, ఇష్టాన్న భోజనంతో సంతృప్తులను చేసేవాడు. వాళ్ళు విశ్రాంతి తీసుకొంటున్నప్పుడు, వాళ్ళ దగ్గర వచ్చి కూర్చునేవాడు. కూర్చొని, ఈ భూమి మీద ఉన్న సముద్రాలు, పర్వతాలు, నదులు, వాటి విశేషాలను అడిగేవాడు. అడగటమే కాదు, అవి తనుండే ఊరికి ఎంత దూరంలో ఉన్నాయో శ్రద్ధగా అడిగి తెలుసుకొనేవాడు. ఆ పుణ్యతీర్థ విశేషాలను తెలుసుకొని, అక్కడకు వెళ్ళాలని ఎంతో కుతూహలం చూపేవాడు. ఇంత వరకు అది నెరవేరనందుకు నిట్టూర్పులు విడిచేవాడు.
ఈ పద్యంలో చెప్పబడిన తీర్థసందర్శనాభిలాష అప్పుడైనా ఇప్పుడైనా చాలా సహజమైన కోరిక. ప్రయాణ సౌకర్యాలు లేని ప్రాచీన కాలంలో, దూరాభారంగా ఉన్న పుణ్యతీర్థాలను సందర్శించటం కష్టసాధ్యమైన పని. అందులోనూ, ప్రవరుని వంటి నిత్యాగ్నిహోత్రికి, నిత్యం అతిథి అభ్యాగతుల సేవ చేసే గృహస్థుకు, ఇది అంత తొందరగా సానుకూల మయ్యేది కాదు. ఆ కోణంలో, ప్రవరుని కుతూహలాన్ని, నిట్టూర్పులను అర్థం చేసుకొనవచ్చు.
పై రెండు పద్యాలు అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము, ప్రథమాశ్వాసం లోనిది.
No comments:
Post a Comment