మాత్రాస్పర్ర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినో నిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ||
ఓలి శబ్దాది విషయ సం యోగములును
మొనసి శీతోష్ణ సుఖదుఃఖములు దలంప
రాకపోకలు గల వస్థిరంబు లరయ
వాని సమదృష్టితో జూడవలయు పార్థ !
' మాత్రలు ' అంటే ప్రకృతిలో ఉన్న భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదు తత్త్వాలు. బయట ప్రకృతిలో ఉన్న యీ ఐదు తత్త్వాలే మానవ శరీరంలోనూ ఉన్నాయి. మానవశరీరం పంచభూతాల కలయిక. ఈ పంచభూతాలకు మానవశరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలకు సంబంధం ఉంది. ఈ ఐదు జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి ఐదు తన్మాత్రలు - శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఈ ఇంద్రియముల యొక్క శబ్దాది విషయ సంయోగం వల్ల చల్లదనం, వేడి, సుఖం, దుఃఖం, మానం, అవమానం, ఇంకా పలురకాలైన ద్వంద్వభావాలు జీవుడికి కలుగుతున్నాయి. కానీ, తెలుసుకొనవలసినది ఏమిటంటే, ఈ శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలు మొదలైనవి స్థిరంగా ఉండేవి కావు. మానవ జీవితంలో ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. ప్రకృతిలో ఉన్న సహజ గుణాలే మానవునిలో ఉన్నాయన్న సంగతి గ్రహించాలి. పగలు, రాత్రి, వెలుగు, నీడ అనేవి ఎంత సహజమో, సుఖదుఃఖాలు మొదలైనవి కూడా అంతే సహజం. కావున, వివేకవంతుడు వాటి విషయంలో ఆందోళన చెందకుండా ఓర్చుకుంటాడు. తితిక్ష అంటే ఓర్పు. ఓర్పు అనేది చాలా మంచి గుణం, చాలా సమస్యలకు పరిష్కారం కూడా.
ఇక్కడ భగవానుడు చాలా జాగ్రత్తగా మాటలను వాడాడు. " సుఖదుఃఖదాః " అన్నాడు. అంటే సుఖము కేవలం సుఖమే కాదు, దుఃఖంతో కూడియున్నదని అర్థం. అంటే, ఒకదాని తరువాత ఒకటి వస్తాయని అర్థం. అట్లాగే శీతోష్ణాలు, మానావమానాలు కూడా. జంటగా ఉన్నవన్నీ ఒకదాని వెంట ఒకటి వచ్చేవే.
అవి " ఆగమాపాయనః ". రాకపోకలు కలిగినవి. సుఖంగా ఉన్నందుకు పొంగి పోనక్కరలేదు, దుఃఖ మొచ్చిందని క్రుంగి పోనక్కరలేదు. అవి ఎండాకాలం, వానాకాలం లాగానే వస్తుంటాయి, పోతుంటాయి. అవి మారుతున్నాయని దుఃఖపడతామా? వాటిని ఓర్చుకున్నట్లే, వీటిని ఓర్చుకోవాలి. అది బుద్ధిమంతుడు చేసే పని.
అందువల్ల, భగవానుడు ఈ శ్లోకంలో సమదృష్టిని అలవరచుకొనమని చెప్పాడు. దానివల్ల, ఈ ద్వంద్వ భావాలు జీవునికి అంటవు. ద్వంద్వాతీతుడైనపుడు, స్వస్వరూపజ్ఞానం కలుగుతుంది.
No comments:
Post a Comment