అవ్వనితా శిరోమణికి నాత్మజుఁడుండిన దివ్వె వెంబడిన్
దివ్వియగాఁగ మీ కులము దీధితి వెల్గు ననంగ, రాజు లే
నవ్వున నౌను లెమ్ము మునినాథులు నిర్ణయముం బొనర్చి నా
రవ్విషయంబు, నీవును సుతార్థిని వౌటను దీక్ష యొప్పగున్.
ఎన్ని తరువులున్న నన్నియుఁ గాయంగఁ
బూటఁ బూట వేచుఁ దోటమాలి
కడుపు నీది కూడఁ గాచిన నా గుండె
యటమటించు టాగి హర్షమొందు.
పుత్రకామేష్టి చెయ్యటం వల్ల పుత్రసంతానప్రాప్తి కలుగుతుందన్న కులగురువు వశిష్ఠులవారి అభయంతో, దశరథుడు అమితోత్సాహంతో ఉన్నాడు. పట్టపురాణి, కౌసల్య, సుమిత్రాదేవి సౌధాలకు వెళ్ళి, ఈ శుభవార్త చెప్పి, వారిని సంకల్పపూర్వకంగా వ్రతదీక్ష వహించమని చెప్పాడు. తరువాత, తన ముద్దులభార్య కైకేయి సౌధానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఈ శుభవార్తను చెప్పి, ఆమెను కూడా వ్రతదీక్షను వహించమని దశరథుడు కోరాడు. అప్పుడు కైకేయి తన మనోగతాన్ని వెల్లడించిన సందర్భమిది.
" స్త్రీలలో శిరోభూషణమైన కౌసల్యాదేవికి పుత్రోదయమైతే, ఒక అఖండజ్యోతి వెనుక ఇంకొక అఖండజ్యోతి వలె, రఘువంశ కీర్తిప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. " అని కైక భర్తతో అన్నది. అప్పుడు దశరథుడు చిరునవ్వు నవ్వి, " అది సరేలే ! ఆ విషయాన్ని వశిష్ఠాది మునీంద్రులు చూసుకుంటున్నారు. నువ్వు కూడా సంకల్పం చేసి వ్రతదీక్ష వహిస్తే బాగుంటుంది. పండ్లతోటలో అన్నీ చెట్లూ కాయలు కాయాలని తోటమాలి అనుకుంటాడు కదా! ఏదో, నీ కడుపున కూడా ఒక కాయ కాస్తే, నా గుండె బరువు తగ్గిపోతుంది. " అన్నాడు దశరథుడు.
శ్రీమద్రామద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టి ఖండము లోని పై పద్యాలు కైకేయికి పట్టపురాణి కౌసల్యపై ఎంత గౌరవప్రపత్తులున్నాయో, ఆమె అక్కగారిని " వనితాశిరోమణి " అని సంబోధించటం వల్ల అవగతమౌతున్నది. తరువాత, " దివ్వె వెంబడిన్ దివ్వియ గాగ, మీ కులము దీధితి వెలుగు " ననటంలో, పట్టపురాణి కౌసల్య కుమారుని వల్ల రఘువంశ ప్రతిష్ఠ అఖండంగా వెలిగుతుందనీ, అతని వల్ల, ఒక దీపం ప్రక్కన ఇంకొక దీపం లాగా, తమ సంతానం కూడా వర్థిల్లుతారని, ఆమె తన సౌశీల్యాన్ని ప్రదర్శించింది.
No comments:
Post a Comment