కాము గెలువ వచ్చుఁ గాలారి గావచ్చు
మృత్యుజయముఁ గలిగి మెఱయవచ్చు
నాఁడువాఱి చూపుటంపఱ గెలువంగ
వశము గాదు త్రిపురవైరికైన.
దేవదానవులు పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించారు. దానిని పంచుకోవటంలో దాయాదుల మధ్య తగాదా మాత్రం తీరింది కాదు. అప్పుడు, అమృతాన్ని పంచటానికి శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా అవతరించాడన్నది లోకవిదితమే.
ఒకసారి విష్ణువుతో సరస సంభాషణ చేస్తున్న శివుడు ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. జగన్మోహనమైన ఆ మోహిని రూపాన్ని చూడాలన్న తన కోరికను వెలిబుచ్చాడు. ఆ తరువాత శివకేశవులు ఎవరిత్రోవన వారు వెళ్ళిపోయారు.
ఇలా ఉండగా, ఉద్యానవనంలో, కళ్ళు మిరిమిట్లు గొలిపే అందంతో ఉన్న ఒక సుందరాంగిని చూసాడు శివుడు. ఆమె ఓ పూబంతితో ఒయ్యారంగా ఆడుకొంటున్నది. నేల మీద పడ్డ బంతిని తీసుకొనడానికి క్రిందకు వంగింది. అప్పుడు ఆమె కుచకుంభముల మీది పైటకొంగు కొంచెం తొలిగింది. కొప్పుముడి వీడి, ముంగురులు జారుతున్నాయి. అసలు ఉందా లేదా అన్నంత సన్నని నడుము కనపడింది. అంతే, శివుడు తట్టుకొనలేకపోయాడు. ఆ సుందరాంగి వెంటబడ్డాడు. ఆమె శివుణ్ణి అలా ఊరిస్తూ వెళ్ళి అంతర్థానమయింది.
ఇక్కడ పోతనగారు లోక స్వభావానికి అనుగుణంగా ఒక అందమైన ఆటవెలదిని మన ముందుంచారు.
" మనసులను కొల్లగొట్టే మన్మథుడిని గెలువ వచ్చు. యముడితో పోరాడి మృత్యువును కూడా జయించ వచ్చు. కానీ, ఆడవారి వాలుచూపులనే తూపులను (బాణాలను) తట్టుకోవడం ఆ త్రిపురాసుర సంహారి శివుడికైనా సాధ్యం కాదు. "
మన్మథుడు శివుని కంటి మంటలలో కాలి బూడిదయిన కథ అందరికీ తెలిసినదే. అదే విధంగా శివుని దయతో అల్పాయుష్కుడైన మార్కండేయుడు చిరంజీవి అవటం జగత్ప్రసిద్ధం.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, అష్టమ స్కంధము లోని ఈ కథలో, హరి పురుషాకారం ధరించి హరునితో చెప్పిన మాటలు కొసమెరుపులు.
" మహాదేవా ! ఇంత వరకు నీ వొక్కడవు తప్ప నా మాయను ఎవరూ తెలుసుకోలేరు. కాలంతో కలిసి నీ మాయ నాలో చేరింది. ఈ మాయ నన్ను గెలువలేదు. "
ఈ జగన్మోహిని కథ, బాణాసురునితో యుద్ధంలో శివతేజం విష్ణు తేజముల మధ్య పోరుని, ఒక తేజం ఇంకొక తేజంలో ఐక్యమై, శివకేశవుల అభిన్నత్వాన్ని సూచించటం, మరొకసారి గుర్తు చేస్తున్నది.
No comments:
Post a Comment