అవిరళ విస్ఫులింగ నివహంబుల నభ్రపథంబు నంటుచున్
దవదహనం బుదగ్రతరుదాహము సేయుచు నున్నఁ జూచి మా
నవపతి దాని యంతరమునన్ వినియెన్ ' నరనాథ ! నన్ను గా
రవమునఁ గావ వేగ యిట ర ' మ్మను నార్తమహానినాదమున్.
కలిప్రభావంతో, నలుడు జూదంలో రాజ్యాన్ని కోల్పోయి దమయంతితో పాటు అడవులకు వెళ్ళాడు. అక్కడ, తనతో పాటు తన భార్య పడే కష్టాలను చూడలేక, ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమెను విడిచివెళ్ళాడు. ఆ విధంగా అరణ్యంలో వెళ్తుండగా, రక్షించమని ఒక ఆర్తనాదం వినిపించింది. దానికి సంబంధించిన విశేషాలు యీ పద్యంలో ఉన్నాయి.
" ఎడతెగకుడా పెద్ద ధ్వనులు చేస్తూ, అగ్నిజ్వాలలని ఆకాశాని కంటేటట్లు పైకెగజిమ్ముతూ, మహావృక్షాలను సైతం దహించి వేస్తూ అరణ్యంలో దావాగ్ని బయలుదేరింది. ఆ దావాగ్ని మధ్యలో నుండి, " మహారాజా ! నన్ను దయతో రక్షించటానికి త్వరగా రా ! " అంటూ వచ్చిన ఒక ఆర్తనాదం విన్నాడు.
ఆ ఆర్తనాదం కర్కోటకుడనే నాగకుమారుడిది. మునిశాపంతో కదలకుండా పడి ఉండి దావాగ్నిలో చిక్కుకున్నాడు. తరువాత, దావాగ్ని నుండి రక్షించిన నలుడిని కరిచి వికృతరూపుడిని చేసాడు. మేలు చేసిన తనకు కీడు తలపెట్టావన్న నలుడితో, ఆ వికృతరూపం కొంతకాలం నలునికి అవసరమని, తనను తలచుకొంటే మళ్ళీ అతనికి నిజరూపం వస్తుందని చెప్పాడు. ఆ తరువాత, నలుడు బాహుకుడు అనే పేరుతో ఋతుపర్ణుని వద్ద తలదాచుకున్నాడు.
ఈ పద్యం నలదమయంతుల కథలో ఒక ముఖ్యమైన మలుపు.
లోకంలో, మేలు చేసినవాడికి సైతం కీడు తలపెట్టిన వాడిని కర్కోటకుడని పిలవడం సర్వసాధారణమయింది. కానీ, చెడులోను ఒక మంచి ఉంటుందని పెద్దలు చెప్పినట్లు, కర్కోటకుడు నలుడిని వికృతరూపుడుని చేయటం వలన భవిష్యత్తులో నలుడికి శుభం చేకూరిందని నలదమయంతుల కథలో తెలుస్తుంది. కర్కోటకుని పేరు తలచుకుంటే కలిప్రభావం తగ్గుతుందని పెద్దలు చెబుతారు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment