కాంచె న్వైష్ణవు డర్థ యోజన జటాఘాటోత్థశాఖోపశా
ఖాంచజ్ఘాట చరన్మరుద్రయ దవీయః ప్రేషితోద్యచ్ఛదో
దంచ త్కీటకృత వ్రణచ్ఛలన లిప్యాపాదితధ్వన్య ని
స్సంచారాత్త మహాఫలోపమ ఫలస్ఫాయద్వటక్షాజమున్.
పలకటానికి, కంఠస్థం చేయడానికి కూడ కష్టమైన పద్యం. శ్రీకృష్ణదేవరాయల ప్రౌఢతర శైలికి ఇది ఒక ఉదాహరణ. అయితే, ఇది సన్నివేశము యొక్క ఔచిత్యం తెలిసి చేసిన రచన. మహాశిల్పి మాత్రమే చేయగలిగిన అక్షరసృష్టి .
ఆముక్తమాల్యద, షష్ఠాశ్వాసము నందలి మాలదాసరి కథ లోని పద్య మిది.
ఒకరోజు అర్థరాత్రి వేళ, కోళ్ళగూట్లో పిల్లి దూరటం వల్ల, కోళ్ళు కూయటం మొదలుపెట్టాయి. గుడికి పోయే వేళయిందని బయలుదేరిన మాలదాసరి, తిరిగి తిరిగి ఒక దట్టమైన అడవిలో ప్రవేశించాడు. ఆ కీకారణ్యంలో అతడు ఒక మఱ్ఱిచెట్టును చూసాడు. ఆ మఱ్ఱిచెట్టు, పరిసర ప్రాంతం వర్ణనే యీ పద్యం.
" మఱ్ఱిచెట్టు అర్థయోజనం పొడవుంది. ఆ మఱ్ఱిచెట్టు ఊడలకు కొమ్మలు, మళ్ళీ ఆ కొమ్మలకు కొమ్మలు పెరిగాయి. అట్లా విస్తరించిన ఆ పెద్ద మఱ్ఱిచెట్టు ఆకుల సందులలో నుంచి గాలి రివ్వున సుడిగాలిలాగా వీస్తున్నది. సుడిగాలి తీవ్రతకు ఆకులు దూర దూరంగా ఎగిరిపడుతున్నాయి. ఆకులన్నీ పురుగులు తొలిచి అక్షరాల లాగా కనపడుతున్నాయి. ఆ అక్షర సముదాయం ఎట్లా ఉందంటే " బాటసారులారా !ఇటువైపు రాకండి. ఈ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసు డున్నాడు " అని చెపుతున్నట్లుంది. అందువల్ల, అక్కడ జనసంచారం లేదు. ఆ విధంగా మనుష్యులను కాపాడుతున్న పుణ్యఫలం వల్ల అన్నట్లు ఆ మఱ్ఱిచెట్టు పెద్ద పండ్లతో విరగకాసి ఉంది. "
భయానకమైన వాతావరణాన్ని తలపించాలంటే, దానికి తగిన భాషను ఎంచుకొనడం మహాకవుల లక్షణం. శ్రీమద్రామాయణ కల్పవృక్షములో విశ్వనాథ, శివధనుర్భంగ ఘట్టంలో, ధనుస్సు విరిగినపుడు వెలువడిన ధ్వనిని వర్ణించటానికి " నిష్ఠావర్షదమోఘ మేఘపటలీ........" అనే పద్యాన్ని, ప్రౌఢమైన దీర్ఘ సంస్కృత సమాసాలతో, పరమ ఔచిత్యభరితంగా రచించారు.
ఇక చరిత్ర పుటల్లోకి వెళ్తే, పూర్వం రోజుల్లో పెద్ద మఱ్ఱిచెట్లు బాట కిరుప్రక్కల ఉండేవి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పెద్ద మఱ్ఱిచెట్లను చూస్తూనే ఉన్నాం. అనంతపురం దగ్గర కదిరిలోని తిమ్మన్న మఱ్ఱిమాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది కదా !
No comments:
Post a Comment