కాలము నేమనవచ్చును?
గాలము గాలంబ పోలుగా కొంటికి నీ
లీలలు గలవే? లెస్సగ
నాలోకించి తిది హితము నభిమతము నగున్.
శ్రీకృష్ణుని అవతార పరిసమాప్తితో దుఃఖానికి లోనయిన అర్జునునికి ఉపశమన వాక్యాలు బోధించిన వ్యాసభగవానుడు, పాండవులు ఇకముందు ఏం చేయాలో చెప్పిపంపాడు. పాండవులను వికారములతో కూడిన యీ దేహాలను త్యజించి, ఉత్తమగతులను పొందమని ఉపదేశం చేశాడు. అర్జునుడు ధర్మరాజు సన్నిధికి వెళ్ళి, యాదవకుల సంక్షయమైన సర్వవృత్తాంతాన్ని వివరించాడు. వ్యాసభగవానుని హితవచనాలను అతనికి ఎరిగించాడు. అది విన్న ధర్మరాజు కూడా మహాప్రస్థానం గురించి తలపోస్తున్నట్లు తన మనసులోని మాటను చెప్పాడు. అప్పుడు, అర్జునుడు కాలవశతను గురించి చెప్పినదే శ్రీమదాంధ్ర మహాభారతము, మహాప్రస్థానిక పర్వం లోని యీ పద్యం.
పద్యం చిన్నదైనా చాలా లోతైన అర్థాన్ని కలిగింది.
" కాలాన్ని ఏమనగలం? కాలవశతను మాటలలో ఎంతని చెప్పగలం? అందుచేత, కాలాన్ని పోలింది కాలం మాత్రమే అని చెప్పాలి. కాలం పోయే పోకడలకు సాటి రాగలిగినవి ఉన్నాయా? దీనిని గురించి నేను బాగా ఆలోచించాను. ఇట్లా చెయ్యటం మనందరికీ మంచిదీ, నాకు నచ్చినదీ కూడా. "
అర్జునుడు కూడా ఇహాన్ని వదలి పరాన్ని గురించే ఆలోచిస్తున్నాడు.
ఈ పద్యంలోని ' ఏమనవచ్చును? ' అన్న నుడికారం ఎంతో అందమైనది, అర్థవంతమైనది. కాలమంటే విధి, మృత్యువు, పరమేశ్వర స్వరూపం అన్న అర్థా లున్నాయి. కాలానికి ఎవ్వరైనా లోబడవలసిందే. ఎవరికీ ఇందులో మినహాయింపు లేదు. అందువల్ల కాలానికి కాలంతోనే పోలిక.
ఈ సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, మహాప్రస్థానిక పర్వానికి డాక్టరు హెచ్.ఎస్. బ్రహ్మానంద వ్రాసిన విశేష వ్యాఖ్య పొందుపొరచటం ఎంతైనా సముచితంగా ఉంటుంది.
" ఏమనవచ్చును అన్న మాటలోని నుడికారం చాలా అర్థం కలిగింది. ఈ సందర్భంలో ఎట్లా వర్ణించగలమని అర్థం - ' రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ ' - అన్నట్లు కాలాన్ని పోలింది కాలం మాత్రమే. బమ్మిని తిమ్మిని చెయ్యగల శక్తి, కొంటెను సాధువుగా మార్చే శక్తి - అఘటన ఘటనా పటీయసి ' - పరమేశ్వర రూపమైన కాలశక్తి. దానిముందు ఎంతటివారైనా తలవంచాల్సిందేనని అర్థం.
బ్రహ్మానందగారు వ్యాఖ్యానించినట్లుగా బమ్మిని తిమ్మిని చెయ్యగల కాలస్వరూపమైన ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ' మా స్వామి (విశ్వేశ్వర శతకము) ' లో కవిసమ్రాట్టులు చెప్పిన యీ పద్యం చూడండి.
కడు నా భాగ్యము సందె చీకటులుగా గన్పించు గన్పించవే
నడకల్ వోయిన గంటకాధ్వములకే న న్నీడ్చు విద్యానిధిన్
జడుడట్టుల్ సుజనున్ దురాత్ముడటు ప్రజ్ఞావంతు సామర్థ్యహీ
నుడు వోలెన్ గనుపింప జేతు విది యెంతో వింత, విశ్వేశ్వరా !
No comments:
Post a Comment