లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘా |
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ||
పూర్వమందున నా చేత ప్రోక్త మయ్యె
ద్వివిధమగు " నిష్ఠ " యర్జునా! వేరుగాదు
కర్మయోగంబు నొగి కామ్యకర్ములకును
సాంఖ్య యోగంబు నుడివితి జ్ఞానులకును.
శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో, శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మాత్మైక సంధానాన్ని, అంటే, పాలునీళ్ళ లాగా, విడదీయలేని ఆత్మపరమాత్మల కలయికను, అద్వైత స్థితిని అర్జునునకు ఉపదేశించాడు. అది విన్న అర్జునుడు సందిగ్ధంలో పడ్డాడు. జ్ఞానయోగమే ఉత్తమమైన ముక్తిమార్గమని బోధించిన కృష్ణుడు ఇప్పుడు తనను యుద్ధరంగంలో శత్రువులతో పోరాడమంటున్నాడు. అనగా, కర్మమార్గం వైపు ప్రోత్సహిస్తున్నాడు. అందువలన, జీవుడు ఏ మార్గాన్ని అనుసరించటం వల్ల శ్రేయస్సును పొందుతాడో సందిగ్ధతకు తావు లేకుండా చెప్పమంటున్నాడు అర్జునుడు. అర్జునుని ఈ అభ్యర్థనకు సమాధానమే భగవానుని నోటి నుండి వెలువడిన యీ శ్లోకం.
" పాపరహితుడవైన అర్జునా ! పూర్వం నా చేత ఈ లోకంలో సాంఖ్య యోగ మనేది జ్ఞానుల కోసం, కర్మ యోగ మనేది యోగుల కోసం, రెండు విధాలైన మార్గాలు చెప్పబడినాయి. "
ఇక భగవానుడు అర్జునుణ్ణి సంబోధించిన తీరును ఒకసారి పరిశీలిద్దాం. ' అనఘా ! ' అంటే, పాపరహితుడా, పాపములు చేయనివాడా ! అని అర్థం. ఆత్మజ్ఞానం వంటబట్టాలంటే పాప చరిత్ర ఉన్నవాడు పనికిరాడు. సన్మార్గం వైపు నడిచేవారికే దీని మీద శ్రద్ధాభక్తు లుంటాయి. దీనిని బట్టి, శ్రీకృష్ణుని దృష్టిలో అర్జునుడు యోగ్యత కలిగిన శిష్యుడు. యోగ్యత కలిగిన శిష్యుడుంటేనే గురువు బోధించిన విద్యకు సార్థకత చేకూరుతుంది.
ప్రస్తుత విషయమైన అర్జునుని సందేహ నివృత్తి చేస్తూ, శ్రీకృష్ణుడు ఒక చక్కని మాట అన్నాడు. ఇప్పుడు తాను చెప్పబోయేది కొత్తదేమీ కాదన్నాడు. ఇది " పురాప్రోక్త " మన్నాడు. అంటే అనాదిగా ఉన్నదే. సృష్ట్యారంభంలో, తన వివిధ అవతారములలో, ఈ విషయం చెప్పబడినటువంటిదే. అయితే, అర్జునుడు సందిగ్ధంలో పడ్డాడు కాబట్టి మళ్ళీ చెపుతున్నాడు.
మానవుల ఆధ్యాత్మికోన్నతి కోసం రెండు మార్గాలను చెప్పానన్నాడు. ఒకటి జ్ఞానమార్గం. అది ఆత్మ పరమాత్మల యందు భేదభావములేని అద్వైతసిద్ధి నొందిన జ్ఞానుల కొరకు. దానిని సాంఖ్యయోగమన్నాడు. రెండవది, కర్మమార్గం. ఇది సమస్త జగత్తునందు పరమాత్మను, పరమాత్మయందు సమస్త జగత్తును దర్శించి, ఫలితాన్ని ఆశించకుండ కర్మలను ఆచరించేవారు. వీరిని కర్మయోగు లంటారు.
పై రెండూ రెండు భిన్న మార్గాలు. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఆచరించవచ్చు. ఉదాహరణకు, ఒకనికి తత్త్వశాస్త్రం మీద, ఇంకొకనికి విజ్ఞానశాస్త్రం మీద ఆసక్తి ఉందనుకోండి. ఎవరికీ దేని మీద ఆసక్తి ఉంటుందో, దాన్ని అధ్యయనం చేస్తేనే, మంచి ఫలితాలు వస్తాయి. రెండూ కూడా సత్యశోధన మార్గాలే. ఎవరికేది సౌలభ్యంగా ఉంటే అది ఎంచుకోవచ్చు. అదేవిధంగా, జ్ఞానమార్గాన్ని అవలంబించే వాళ్ళు, ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సు పోకడలను నియంత్రించి, విషయాతీతులై స్వస్వరూపాన్ని తెలుసుకుంటారు. అదే ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం అంటే. తనను తాను తెలిసికొనడం, తనలో శుద్ధచైతన్యంగా ఉన్న వెలుగును చూడటం, తనలో ప్రకాశించే వెలుగే, సర్వప్రాణులలోనూ ఉందనే ఎరుక కలిగి ఉండటం. జ్ఞానయోగి తన యందు ప్రకాశించే ఆ వెలుగుకు, విశ్వవ్యాప్తమై ఉన్న వెలుగుకు ఏ మాత్రం భేదం లేదని తెలుసుకుంటాడు. తానే వెలుగవుతాడు, స్వయంప్రకాశకుడౌతాడు. " తత్త్వమసి " అంటే అదే. అది అద్వైతసిద్ధి, అమృతత్త్వలబ్ధి, బ్రహ్మాత్మైకానుసంధానం.
ఏ ఫలాన్ని ఆశించకూడా, నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ, తాము నిమిత్త మాత్రులుగా ఉంటూ, సర్వం పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం అని భావిస్తూ, శరణాగతిని పొందేవారు. వీరిని కర్మయోగు లంటారు. వీరికి సర్వ జగత్తు భగవన్మయంగా కనిపిస్తుంది, పరమాత్మలో సర్వ జగత్తు కనిపిస్తుంది.
పై రెండు కూడా విశిష్టమైన మార్గాలు. వేరు దారులు. కానీ, రెండు దారులు చెరేది ఒకేచోటికి. ఇదే సనాతనధర్మంలోని భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వం యొక్క సమన్వయం.
ఇది శ్రీమద్భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగం లోని మూడవ శ్లోకం.
No comments:
Post a Comment