ఈతడు రణంబునకు నెత్తి చనుచుండియును నెంతయును భక్తిఁ గని నాకుం
బ్రీతియెసగం బలికి బ్రేమ మొలయం బొగడి పెద్దయు వినీతినిరతుండై
చేతులు మొగిడ్చి జయ సిద్ధియుఁగ దీవన విశిష్ట దయ నిమ్మనిన ధర్మం
బే తల సమానమగు నిద్ధజయ మా తలకు నెట్లయిన సిద్ధమగు నంటిన్.
జూదమునప్పుడు సర్వజనంబులు చూచి భయంపడి యిప్పని యి
మ్మేదిని సేనలకుం గురుకోటికి మృత్యువు గాని నిజం బలఁతిం
బోదని యాడరె? యమ్మెయి నాదగు బుద్ధికిఁ దోఁచిన సత్యము దా
మోదర ! పాటిలదే కొడుకంచుఁ బ్రియోక్తులుఁ వల్కినఁ బెంపు సెడున్.
యుద్ధరంగంలో విగతజీవుడై పడి ఉన్న దుర్యోధనుడిని చూసి గాంధారి విలపిస్తున్న ఘట్టం శ్రీమదాంధ్ర మహాభారతము, స్త్రీ పర్వం, ద్వితీయాశ్వాసంలో ఉంది.
తొడలు విరిగి నేలపై పడి ఉన్న కొడుకు కళేబరాన్ని చూసి గాంధారి మూర్ఛపోయింది. కొంతసేపటికి, పరిచారికల ఉపచారాలతో తెప్పరిల్లి, కుమారుడి శవంపై పడి యిలా రోదిస్తున్నది.
" ఈ సుయోధనుడు యుద్ధానికి వెళ్తూ, భక్తితో నన్ను చూడటానికి వచ్చాడు. నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. చేతులు జోడించి నమస్కరించి, యుద్ధంలో విజయం కలిగేటట్లు ఆశీర్వదించమన్నాడు. అప్పుడు నేను " నాయనా ! ధర్మం ఏ పక్షాన అధికంగా ఉంటుందో ఆ పక్షానికి విజయం సిద్ధిస్తుందని " చెప్పాను.
ఆనాడు జూద మాడుతున్న సమయంలో, ద్రౌపదీమానభంగ ప్రయత్నం చేసినప్పుడు, అక్కడున్నవారంతా, ఇది కౌరవవంశ వినాశహేతువవుతుందని, ధర్మం అంత సులభంగా నశించదని అన్నారు కదా ! నిజంగా నా బుద్ధికి కూడా అదే తోచింది. అది జరగకుండా ఎలా ఉంటుంది? నా కొడుకని మెప్పుకోలు మాటలు మాట్లాడటం గౌరవమా? "
" యతో ధర్మ స్తతో జయః (ఎక్కడ ధర్మ ముంటే అక్కడ విజయం ముంటుంది. ) అని ఆర్యోక్తి. భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా:
" యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం. || " అని చెప్పాడు.
జూదమాడే సమయంలో, మహాపతివ్రత అయిన ద్రౌపదీమానభంగ ప్రయత్నం జరిగినప్పుడు, గాంధారి యొక్క స్త్రీ హృదయం తల్లడిల్లిపోయింది. కొడుకు దుశ్చర్యలను ఆపలేని అశక్తురాలైపోయింది. ఆనాడే కౌరవవంశక్షయానికి బీజం పడిందని గాంధారికి తెలుసు. అందుకనే, యుద్ధానికి వెళ్తూ కొడుకు దీవెన లడిగినప్పుడు, ధర్మం పక్షాన నిలబడింది కానీ, పుత్రవ్యామోహం చూపలేదు. అది ఆనాటి విశిష్టమైన స్త్రీల మానసిక పరిపక్వత, ధర్మానుసరణబుద్ధి. అయితే, చివరి క్షణంలో నైనా కొడుకులో ధర్మచింతన కల్గుతుందేమోనని ఆ మాతృహృదయం ఆశించింది.
ఇక తిక్కనసోమయాజి వాడిన ఛందోవృత్తాలను పరిశిలిద్దాం.
మొదటి పద్యంలో ధర్మవిజయానికి సూచికగా ' మంగళ మహాశ్రీ ', రెండవ పద్యంలో మానవతి ద్రౌపది విషయం ప్రస్తావన సందర్భంగా ' మాలినీవృత్తం ' వాడటం ఎంతైనా సముచితంగా ఉంది. సందర్భానుసారంగా ఛందోరీతులను ఎన్నుకోవడటంలో ప్రాచీనులలో కవిబ్రహ్మ, ఆధునికులలో కవిసమ్రాట్టులు సిద్ధహస్తులు.
No comments:
Post a Comment