ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి మిచ్చిన దీనికిం దొడ
బడ మని దుర్జనత్వమున బల్కెడు వీరుల మస్తకంబుపై
నిడియెద నంచుఁ దాఁ జరణమెత్తె సభన్ సహదేవుఁ డట్టిచో
నుడిగి సభాసదుల్ వలుకకుండిరి తద్దయు భీతచిత్తులై.
చెలువుగఁ బుష్పవృష్టి గురిసెన్ సహదేవుపయిన్, దివంబునన్
వెలయగ సాధువాదముల్ వించె, సభాసదులెల్ల విస్మయా
కులిత మనస్కులైరి, తన కంచెయుఁ గృష్ణమృగాజినంబునుం
బలుమఱు వీచుచుం గలహబంధుడు నారదుఁ డాడె వేడుకన్.
ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. అగ్రపూజకు భగవంతుడైన శ్రీకృష్ణుడు తగినవాడని భీష్ముడు నిర్ణయించాడు. ధర్మరాజు కృష్ణునికి అర్ఘ్యమిచ్చాడు. దానిని తప్పుబట్టిన శిశుపాలుణ్ణి బుజ్జగింప చూసాడు ధర్మరాజు. భీష్ముడు ధర్మరాజును వారించి, అవినయంతో, అహంకారంతో పెచ్చురేగిపోతున్న శిశుపాలుడి మాటలను పట్టించుకోనవసరం లేదని చెప్పాడు. అంతా గమనిస్తున్న సహదేవుడు కల్పించుకొని ఇలా అన్నాడు:
" మేము శ్రీకృష్ణునికి అర్ఘ్య మిచ్చాము. దుర్బుద్ధితో దీనిని తప్పుబట్టి, ఒప్పుకోమనే వాళ్ళ తలలపై కాలు పెట్టి అణగత్రొక్కుతాను" అని సహదేవుడు పాదం ఎత్తగానే, సభాసదులంతా భయంతో ఎక్కడివాళ్ళక్కడ కిక్కురుమనకుండా కూర్చున్నారు.
అప్పుడు సహదేవుని మీద పూలవాన కురిసింది. ఆకాశంలో నుండి సహదేవుడిని మెచ్చుకొంటున్నట్లు ప్రశంసావాక్యాలు వినిపించాయి. సభాసదులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇక కలహభోజనుడైన నారదుడైతే, తన దగ్గరున్న చామరాన్నీ, జింకచర్మాన్నీ పలుమార్లు వీస్తూ, ఆనందంతో నృత్యం చేశాడు. "
సహజంగా, సహదేవుడు బుద్ధిశాలి, సత్త్వగుణ సంపన్నుడు. కానీ, భగవంతుడైన శ్రీకృష్ణుని నిందించటం సహించలేకపోయాడు. సహదేవుని చర్య తాత్కాలికంగా నైనా శిశుపాలుడి వంటి వారి నోటి దురుసుతనానికి అడ్డుకట్టవేసింది. సహదేవుని మాటలలో ధర్మ మున్నది కనుక, అతని పై పూలవాన కురిసిందని, దేవముని నారదుడు కూడా ఆనందంతో నాట్యం చేసాడని భావించాలి.
ఈ రెండు పద్యాలు శ్రీమదాంధ్ర మహాభారతము, సభాపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉన్నాయి.
No comments:
Post a Comment