స్వర్గమన్ గోవు వెన్ జనిన త్వత్పురీవృషగళమున వ్రేలాడు గంగడోలు
ప్రళయకాలమున వైవస్వతమనువు చే మిగిలిన తొలిచోఱ మీనుముల్లు
మనువంశ్యపతుల ధర్మపు స్వాతిచినుకైన ముక్తకయోధ్యకు శుక్తి డిప్ప
త్రేతగా జాఱెడు కృతపురుషుండు కాల్ నిలువఁద్రొక్కిన మిట్టనేలకొడుపు
ఊర్ధ్వలోకపుఁ బ్రాదూల మొఱుగకుండ
గట్టి ఱాకంబముగ నిల్పినట్టి పోటి
పార్థివేంద్ర ! యయోధ్య వప్రంపుగోడ
యీ పురీ జయలక్ష్మికి నినుపతొడుగు.
సాకేతరాజ్యానికి అయోధ్య రాజధాని. అయోధ్య పట్టణం యొక్క ఉన్నతమైన కోటను వర్ణించారు విశ్వనాథ ఈ పద్యంలో.
" స్వర్గమనే గోవు వెనుక వస్తున్న అయోధ్యా నగరమనే ఎద్దు మెడ క్రిందిభాగంలో వ్రేలాడుతున్న గంగడోలు లాగా ఉంది పట్టణపు కోట. ప్రళయకాలంలో, వైవస్వతమనువు ఓడను లాగిన ఆదిమత్స్యపు పెద్దముల్లు లాగా ఉంది. మనువంశరాజుల ధర్మపరిపాలనకు స్వాతిచినుకు వంటిదైన ముక్తిభూమి అయోధ్యకు ముత్యపుచిప్ప వంటిది. త్రేతాయుగంలోకి జారుతున్న కృతపురుషుడు ఉన్నతంగా ఉన్నటువంటి భూమిపై కాలు నిలద్రొక్కుకొనటానికి చిక్కినటువంటి పట్టు. ఊర్థ్వలోకపు పాతదూలం ఒరిగిపోకుండా పోటీ పెట్టిన రాతిస్థంభం. అంత ఉన్నతమైన అయోధ్యానగరపు కోటగోడ ఆ రాజ్యం యొక్క విజయలక్ష్మికి ఇనుపతొడుగు లాంటిది. "
స్వర్గమనే గోవు వెంట వెళ్ళే అయోధ్యా నగరమనే ఎద్దు అనటం వల్ల అయోధ్యానగరం సుఖసౌఖ్యాలకు ఆటపట్టనీ, ప్రళయకాలంలో ఆదిమత్స్యపు పెద్దముల్లు అనటం వల్ల, అది పురాతన నగరమనీ, మనువంశ రాజుల ధర్మపరిపాలనకు స్వాతిచినుకు వంటిదనటం వల్ల, అయోధ ముక్తిధామమనీ, కృతపురుషుడు త్రేత లోనికి వచ్చేటప్పుడు, కాలు నిలద్రొక్కుకొనటానికి దొరికిన ఒడుపు అనటం వల్ల, ధర్మం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందనీ, ఊర్థ్వలోకం లోని పాతదూలం ఒరగకుండా పోటీపెట్టిన రాతిస్తంభ మనడం వల్ల, అయోధ్యాపట్టణం జీవుల ఊర్థ్వగతికి పట్టుకొమ్మ అనీ, మొత్తంగా అయోధ్యా నగరం యొక్క విజయలక్ష్మికి ఆ నగరపు కోటగోడ ఇనుపతొడుగు లాంటిదని తెలుస్తున్నది.
ఈ సీసపద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టి ఖండము లోనిది.
No comments:
Post a Comment