కురుకులు లాదరింపఁగ సఖుండును నాప్తుఁడునై తనర్చి సో
దర తరుణీజనంబులను దత్పతులం గడు గారవంబునం
గరుణ దలిర్ప నాత్మజులకంటెఁ బ్రియోన్నతి బ్రోచువాడు సు
స్థిరమతి నున్నవాడె వసుదేవుడు వృష్ణికులప్రదీపకా!
కౌరవ పాండవుల మధ్య శాంతి నెలకొల్పటానికి ప్రయత్నం చేసి విఫలుడైన విదురుడు తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టాడు. అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి, పవిత్ర నదీజలాల్లో స్నానం చేసిన విదురుడు ప్రభాసతీర్థం చేరుకొన్నాడు. అక్కడ, కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనాదులు మరణించారన్న వార్త విని చాలా దుఃఖించాడు. మళ్ళీ తీర్థయాత్రలు చేస్తూ, యమునానదీ తీరంలో ఉద్ధవుణ్ణి కలుసుకొన్నాడు. విదురుడు పేరుపేరునా అందరి యోగక్షేమాలు అడగసాగాడు. మొదటగా, అవతారమూర్తులైన బలరామకృష్ణులు ఎట్లా ఉన్నారని అడిగాడు.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, తృతీయస్కంధము లోని యీ పద్యంలో వసుదేవుణ్ణి గురించి కుశలప్రశ్నలను వేసాడు.
" వృష్ణి వంశాన్ని ప్రకాశింపజేసే ఉద్ధవా ! కురుకులానికి చెందిన కౌరవులు, పాండవులు తనను గౌరవిస్తుండగా, స్నేహభావంతో, ఆదరభావంతో, తన చెల్లెళ్ళను, వారి భర్తలను ఎంతో ఆప్యాయంగా కన్నబిడ్డల వలె ఆదరించే వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? "
విదురుడు సత్త్వగుణసంపన్నుడు. అందరూ శాంతిసౌభాగ్యాలతో తులతూగాలని కోరుకొనేవాడు. కురువంశ క్షయంతో శోకతప్తుడైన అతడికి కృష్ణుని చెలిమికాడు, పరమ భక్తుడు అయిన ఉద్ధవుడు కనపడగానే, ప్రేమాతిశయంతో అందరి యోగక్షేమాలను అడగటం మొదలుపెట్టాడు.
No comments:
Post a Comment