యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం ||
ధర్మ హానియై, యధర్మంబు వృద్ధియౌ
నెప్పు డట్టి తఱిని యేనె నన్ను
సృష్టి జేసికొందు స్పష్టముగా పార్థ !
ధర్మ రక్షణంబు ధాత్రి సలుప !
శ్రీమద్భగవద్గీత, జ్ఞాన యోగంలోని ఏడవ శ్లోకం, ధర్మం యొక్క విశిష్టతను చాటి చెపుతున్నది.
మహాభారత రచనారంభ సమయంలో వేదవ్యాస మహర్షి తన ఆవేదనను ఈ విధంగా తెలియజేసాడు.
" ఊర్ధ్వబాహు-ర్విరౌమ్యేష
న చ కశ్చిచ్ఛ్రుణోతి మాం
ధర్మాదర్థశ్చ కామశ్చ
స ధర్మః కిం న సేవ్యతే. "
( చేతులెత్తి మొరపెట్టుకుంటున్నాను. ఘోషిస్తున్నాను. ఒక్కడూ నా మాట వినిపించుకోవటం లేదు. ధర్మం నుండే అర్థమూ, కామమూ సంపాదించాలి. (అనగా ధార్మికంగా అర్థం సంపాదించాలి. ధార్మికంగానే కామాన్ని సంపాదించాలి. ) అటువంటి ధర్మాన్ని ఎవడూ సేవించడే? ఏమిటీ వింత ! )
దీనిని బట్టి వ్యాసమహర్షి ధర్మానికెంత ప్రాధాన్య మిస్తున్నాడో, దానికోసం ఎంతగా ఆవేదన చెందుతున్నాడో తెలుస్తున్నది.
అదేవిధంగా, భగవంతుడైన శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.
" ఓ భరతవంశానికి చెందినవాడు అర్జునా ! ఎప్పుడైతే ధర్మం నశించి, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడల్లా నేను అవతరిస్తూ ఉంటాను. "
సగుణతత్త్వంలో, శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు. అందువల్ల, ధర్మానికి హాని కలిగినప్పుడల్లా భగవంతుడైన శ్రీ మహా విష్ణువు అవతారలెత్తుతూ ఉంటాడు. భగవంతుని ఏకవింశత్యవతారాలు (ఇరువదియొక్క అవతారాలు) అటువంటివే.
అవతారము అంటే దిగిరావటం. అధర్మం పెరిగినపుడు భగవంతుడు ధర్మ పరిరక్షణార్థం భూమి పైకి దిగి వస్తాడు.
ఇది పలువురి చేత ఉదహరించబడే భగవద్గీతలోని ప్రసిద్ధమైన శ్లోకం.
No comments:
Post a Comment