వనజాతాయతనేత్రు నున్నతబృహద్వక్షఃస్థలున్ సింహసం
హననుం బాండవసింహమున్ హృదయజన్మాకారు నుద్యన్మహా
శనికల్పస్థిరబాహుఁ జూచుచు మనోజాతాగ్నిసంజాతవే
దన యై రాక్షసి కామరూపధర మర్త్యస్త్రీస్వరూపంబుతోన్.
తానుంటున్న అరణ్యప్రాంతంలో, నరవాసన పసిగట్టిన హిడింబాసురుడు, ఆ మనిషిని చంపి మాంసఖండాలు పట్టుకురమ్మని చెల్లెలు హిడింబను పంపాడు. అక్కడకు వెళ్ళిన హిడింబ, భీమసేనుడిని చూసి మన్మథవికారానికి లోనయింది. హిడింబను కామోద్రేకానికి గురిచేసిన భీమసేనుని దేహవర్ణనే యీ పద్య విశేషం.
" విచ్చుకొన్న పద్మాల వంటి నేత్రాలు కలవాడు, ఎత్తైన, విశాలమైన ఱొమ్ము కలవాడు, సింహం నడుము వంటి సన్నని నడుము కలవాడు, మనస్సు నుండి పుట్టిన మన్మథుని ఆకారం వంటి ఆకారం కలవాడు, వజ్రాయుధ సమానమైన గట్టి చేతులు కలవాడు, పాండవమధ్యముడు, అయిన భీముణ్ణి చూసి, మన్మథాగ్ని వేదనకు లోనయి, తనకు కావలసిన రూపాన్ని ధరించగల రాక్షసి హిడింబ, అందమైన మానవస్త్రీ రూపాన్ని దాల్చింది. "
హిడింబ రాక్షస స్త్రీ. కామోద్రేకం ఎక్కువగా ఉన్న రాక్షస స్త్రీలకు నచ్చేది, పురుషుల రూపలావణ్యం కంటె వారి దృఢమైన శరీరం. ఈ పద్యం లోని భీమసేనుని దేహవర్ణన, హిడింబ కోరికకు తగ్గట్టుగా, ఔచిత్యభరితంగా ఉంది. భీమసేనుని వర్ణనకు నన్నయగారు ఎంచుకొన్న ఛందస్సు మత్తేభవృత్తం అనేది ఇక్కడ గమనార్హం.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వం, షష్ఠాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment