అంతకు బిన్నలున్ వెదక నంతకు బెద్దలు లేవు దుఃఖ మ
మత్యంతము జేయ సౌఖ్య మెసలార నొనర్పగ నొం డొకంటి యం
దంతటి నేర్పు లేదు వెఱ పెన్నది యేమియు నవ్వనంబు ని
శ్చింతత జొచ్చియున్న నరు జెందరు నిర్వృతి సెందు నుగ్మలీ !
శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధ పర్వములో ' బ్రాహ్మణగీతలు ' అనేవి శ్రీకృష్ణార్జున సంవాదంలో భాగంగా కనిపిస్తాయి. అర్జునుడి అభ్యర్థన మేరకు కృష్ణభాగవానుడు భగవద్గీత సారాన్ని మరొక్కసారి చెప్పసాగాడు..
" బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భార్యాభర్తల మధ్య జరిగిన గొప్ప సంభాషణ 'అభయ ' మనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఊరివారందరూ ఆ బ్రాహ్మణుడిని ఆత్మజ్ఞానసంపన్నుడని ప్రశంసిస్తుంటారు. ఒకనాడు భార్య భర్తను సమీపించి ఆత్మజ్ఞానాన్ని బోధించమని వినయంగా ప్రార్థించింది. బ్రాహ్మణుడు సంతోషించి ఆమెకు ఆత్మజ్ఞానాన్ని బోధించటం ప్రారంభించాడు. ముందుగా లోకవ్యవహారమైన కర్మలను చేయటం గురించి, ఆ తరువాత పరమోన్నతమైన బ్రహ్మలక్షణం గురించి చెప్పాడు. దానిని ఆత్మదర్శనం, అక్షరతత్త్వోపాసనం అంటారని చెప్పాడు. ఆత్మజ్ఞానం అనేది ఇంద్రియాలను అదుపులో పెట్టడం వల్ల, తద్వారా మనస్సు మీద పట్టు సాధించటం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. ఇంద్రియనిగ్రహం అంటే, బాహ్యేంద్రియ, అంతరింద్రియ నిగ్రహం. అప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద , మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు సాధకుడిని బాధింపలేవు.
బ్రాహ్మణుడు మొత్తం విషయాన్ని అలంకారసహితంగా చెప్పాడు. తాను కోపమనే చీకటిని, లోభమనే మహాసర్పాన్ని తప్పించుకొని, కోరికలనే దొంగలతో నిండిన భయంకరమైన పాడుబడిన కోటను దాటి, ఒక అడవిలోకి ప్రవేశించానని భార్యకు ఉపదేశించాడు.
ఆత్మజ్ఞానమనే అడవిని అలంకారసహితంగా వర్ణించిన తీరు ద్వితీయాశ్వాసంలోని ఈ పద్యంలో కనపడుతుంది.
" ఓ వనితా ! ఆ అడవి చాలా విచిత్రమైనది. అక్కడ చిన్న పెద్ద అనే తేడా ఉండదు. విపరీతమైన దుఃఖాన్ని కలిగించే, అంతులేని సుఖాన్ని ఇచ్చే విషయాలు అక్కడ ఉండనే ఉండవు. ఏ విధమైన ' చింత ' లేకుండా అక్కడికి ప్రవేశించిన వానికి ' భయ ' మనేది ఉండదు. అట్లా భయరహితుడైనవాడు ముక్తిని పొందుతాడు. "
సుఖదుఃఖాలనే వాటిని విషయాలంటారు. ఇంద్రియాలు చాలా నేర్పుగా విషయాలను లొంగదీసుకొంటాయి. దానివలన ' చింత ', తద్వారా ' భయం ' అనేవి ఏర్పడుతాయి. చిన్న పెద్ద అంటే ద్వంద్వభావాలు. సుఖదుఃఖాలు అనేవి కర్తృత్వ భావాలు, అంటే, ' నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను ' అనే భావాలు. ఆ భేదభావం తొలగిపోతే ' చింత ' ఉండదు. ' చింత ' తొలగిపోతే, ' భయం ' అనేది ఉండదు. భయం తొలగిపోతే ధైర్యం అనేది ఆ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దానిని ' ధృతి ' అంటారు. నిర్భయుడికి నిష్కామ కర్తృత్వం ప్రాప్తిస్తుంది. అంటే " నేను యీ పనిని చేస్తున్నాను, నేను దీనిని అనుభవిస్తున్నాను " అనే భావన ఉండదు. దానిని ' నిర్వృతి ' అంటారు. అదే అక్షరతత్త్వం. నాశనము లేని, అఖండమైన, నిత్యమైన, ఆనందదాయకమైన మోక్షసిద్ధి.
No comments:
Post a Comment