' జననాథ ! శల్యుండు సమసె సౌబలుడు గీ
టడగె నులూకుండు మడిసె సకల
సంశప్తకులు గడచనిరి కాంభోజ శ
తానీకములు దెగటాఱె యవన
పార్వతీయమ్లేచ్ఛబలములు ద్రుంగె నల్
దిక్కుల మన్నీలు దక్కుగలుగు
నరనాయకులును జచ్చిరి కుమారులు గల
యందఱు దెగిరి గర్ణాత్మజులును
బొలిసిరయ్య ! వృకోదరు పలుకు దప్ప
కుండ దద్గదాదండప్రచండనిహతి
రెండు దొడలును విఱిగి ధరిత్రి బెలుచ
గూలి రూపఱి రారాజు ధూళి బ్రుంగె.
పద్దెనిమిదో రోజు యుద్ధంలో కౌరవ వంశక్షయం చూసిన ఆ మధ్యాహ్నానికి సంజయుడు ధృతరాష్ట్రుని మందిరానికి చేరాడు. అప్పటికే అక్కడ గాంధారి, కోడళ్ళతో కూర్చొని ఉంది. విదురుడు కూడా అక్కడే ఉన్నాడు. వెళ్ళగానే, ధృతరాష్ట్రునికి పాదాభివందనం చేసి, బోరున విలపిస్తూ ఈ విధంగా చెప్పాడు.
" ధృతరాష్ట్ర మహారాజా ! యుద్ధంలో, శల్యుడు, శకుని, శకుని కొడుకు ఉలూకుడు, సంశప్తకులందరూ, కాంభోజరాజులు, యవనులు, పార్వతీయులు, ంలేచ్ఛులు , వారి సేనలు, నాలుగు దిక్కు ల నుంచి వచ్చిన వివిధ దేశాధీశులు, వారి కుమారులు, కర్ణుడి కొడుకులు అందరూ మరణించారు. భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి ప్రతిజ్ఞ నెరవేర్చుకొన్నాడు. తొడలు విరిగిన కురురాజు నేలమీద దుమ్ము ధూళిలో పడి ఉన్నాడు."
తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, శల్యపర్వము, ప్రథమాశ్వాసానికి విశేష వ్యాఖ్య వ్రాసిన డాక్టరు పి. వెంకటరాజుగారు, " ఈ సీసపద్యంలో తిక్కజయ్వ వాడిన పదమును వాడకుండా తొమ్మిది శబ్దములను ప్రయోగించారని, ఆ శబ్దాలు ' చచ్చుట ' అని ఒకే అర్థాన్నిస్తున్నాయన్, ఇది తిక్కయజ్వ శబ్దవైచిత్రికి చక్కని ఉదాహరణ " అని పేర్కొన్నారు.
ఆ తొమ్మిది పదాలు వరుసగా, సమసె, కీటడగె, మడిసె, కడచనిరి, తెగటాఱె, త్రుంగె, చచ్చిరి, తెగిరి, పొలిసిరి. అన్నీ ఒకే అర్థాన్నిస్తున్నాయి.
No comments:
Post a Comment