అనవుడు ' హింస పాప మని యాగమవాక్యము లంద కాదె ! యేఁ
గని యిటు లంటి ' నన్న యతిఁ గన్గొని ' నీవు సమాధిఁ బ్రాణరో
ధనము మనోలయంబు సుకృతంబులుగా నొనరించి వెండి యో
గ నిరతిఁ బొందె దత్తెఱఁగు గాదొకొ హింస ? దలంచి చూడఁగన్.
' పరమతపంబు గాఢపరిపాకము నొందినఁ జిత్సుఖా
క్షరమునఁ జిత్తభూతగుణజాలతనున్ క్షరమున్ వివేకితా
పరిణతిఁ బాపి చూచి అనపాయ సుఖస్థితి నూఁది పొల్లలం
బొరయక త్రోపు హింస యను బుద్ధి విమూఢత గాక బోధమే?
అనవుడు నాత 'డార్య వచనామృత మానినవాఁడు కీడుమేల్
గనుఁగొనఁ జాలు, నేను బశుకార్యము నప్పుడు మీ రనుగ్రహిం
చిన క్రియఁ జూడ నేర్తుఁ జిదచిద్ద్వయమున్ విభజించి దాన హిం
సన నొకింతయుం బొరయ జన్నము సేయుదు మేలు బొందుదున్.
శ్రీ మదాంధ్ర మహాభారతము, అశ్వమేధ పర్వం, ద్వితీయాశ్వాసంలో యాజ్ఞికుడికి ఒక యతికి మధ్య యజ్ఞంలో జరిగే పశుహింసను గురించి సంవాదం జరిగింది.
ఒక అధ్వర్యుడు యజ్ఞంలో పశువును బలి ఇవ్వటానికి సిద్ధపడుతుండగా, ఒక యతి అది హంస కదా అని ప్రశ్నించాడు. దానికి యాజ్ఞికుడు " అయ్యా ! ఇది వేదవిహితమైన కర్మ. అందువల్ల, ఇది హింస అనబడదు. బలి ఇవ్వబడిన మేక ఉత్తమలోకాలను పొందుతుంది. " అని చెప్పాడు. అప్పుడు, యతీశ్వరుడు, " అది సరే ! ఈ మేకను బలి ఇవ్వటం వల్ల నీకు ఒరిగేదేమిటి? " అని అడిగాడు. దానికి యాజ్ఞికుడు, వేదవిధి ప్రకారం యజ్ఞం చేసి, పశువును బలి ఇస్తే, స్వర్గసౌఖ్యాలు లభిస్తాయని చెప్పాడు. మళ్ళీ యాజి యతీశ్వరుల మధ్య సంవాదం ఇలా కొనసాగింది.
యతి: నువ్వు చెప్పిన వేదాలే హింస మహాపాపమని చెప్పాయి కదా!
యాజి: అలాగైతే, నువ్వు తపస్సమాధిలో ఉండి, గాలిని బంధించినపుడు మాత్రం హింస జరగటం లేదా?
అది విన్న యతి ఇలా సమాధానమిచ్చాడు.
" గాఢ తపస్సు చేత జ్ఞానానందరూపమైన, అక్షరమైన, గుణాతీతమైన అద్వైతస్థితి కలుగుతుంది. క్షరమైన శరీరభ్రాంతి నశిస్తుంది. కాబట్టి, ఇంద్రియాలను వశం చేసుకొని, మనస్సును నియంత్రించి, పొందేటటువంటి యీ అద్వైతానందాన్ని హింస అనటం అజ్ఞానం తప్ప ఇంకొకటి కాదు. "
దానికి జవాబుగా యాజి:
" స్వామీ ! పెద్దల మాటలు అనే అమృతాన్ని త్రాగినవాడికి జ్ఞానాజ్ఞాన వివేచన కలుగుతుంది. అందువల్ల, నేను పశువును బలి ఇచ్చేటప్పుడు కూడా, మీరు చెప్పిన అక్షర క్షర తత్త్వాలను దర్శించగలుగుతున్నాను. దీనిమూలంగా, నాకు హింస అనేది అంటదు. " అన్నాడు.
అన్నీ విన్న యతీశ్వరుడు, " దీనిని గురించి మనకు వాదం ఎందుకు? పశుయజ్ఞం కంటే తపోయజ్ఞం ఉత్తమమని నేను అట్లా చెప్పాను. " అన్నాడు.
ఆ మాటకు అధ్వర్యుడు కూడా ఒప్పుకున్నాడు.
మహాభారత మొక విశ్వవిజ్ఞానఖని. ఎన్నో ధర్మసందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఎంత తవ్వుకున్నవాడి కంత ఫలం.
No comments:
Post a Comment