రభసక్షోభితమేదినీతలముపై రథ్యప్రచారంబు లొ
ప్ప భుజాగర్వము నెమ్మొగంబులఁ దలిర్పం గన్నెకయ్యంబు న
ర్థి భవత్పుత్రులమీఁది కోపమున నుద్దీపింప నేతెంచి ర
య్యభిమన్యుండును ద్రౌపదేయులును మాద్యద్దంతియూథాకృతిన్.
తిక్కనసోమయాజి " ఉభయకావ్య ప్రౌఢ శిల్ప పారగుడు, తెలుగు నుడికి పట్టం కట్టిన ధీవిలసితుడు " అని జ్ఞానపీఠ బహుమతి గ్రహీత సినారె తిక్కనసోమయాజి శిలావిగ్రహం క్రింద వ్రాయించారు.
శ్రీమదాంధ్ర మహాభారతము, భీష్మపర్వం, ప్రథమాశ్వాసంలోని యీ పద్యం సంస్కృతాంధ్ర పదాల కలయికగా, సుభద్రాతనయుని, ద్రౌపదీపుత్రుల సమరోత్సాహాన్ని తెలియజేస్తున్నది.
" సుభద్ర కుమారుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు, గుర్రాల మీద యుద్ధరంగానికి వస్తుంటే, భూమి దద్దరిల్లింది. వాళ్ళ ముఖాలలో పరాక్రమాతిశయం కొట్టొచ్చినట్లుగా కనపడుతున్నది. ఓ ధృతరాష్ట్ర మహారాజా ! మొదటిసారి యుద్ధం చేస్తున్నారు కాబట్టి, ఎట్లాగైనా నీ కొడుకుల మీద ఉన్న కోపం వాళ్ళను ప్రేరేపిస్తున్నట్లున్నది. యుద్ధభూమికి వాళ్ళొస్తుంటే మదగజాలు వసున్నట్లుగా ఉంది. "
అభిమన్యుడిలో, ద్రౌపది కొడుకుల్లో, యువకరక్తం పొంగి పొర్లుతున్నది. అందులోనూ వాళ్ళు చేస్తున్న మొదటి యుద్ధమిది. దానిని తిక్కన ఎంతో అందంగా, " కన్నెకయ్యం " అని చెప్పాడు. " కన్నెకయ్యం " అనేది ప్రౌఢ ప్రయోగమని, కన్యకు మొదటి రాత్రి ఎంత మధురానుభూతులను తెస్తుందో, వీరులకు మొదటి యుద్ధం కూడా అంతేనని, డాక్టరు నండూరి రామకృష్ణమాచార్యులుగారు వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment