కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్యనృపతుల్, సంబంధులై వృష్ణులున్,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రిం గంటి, మెట్లైన నుద్దామ
ధ్యానగరిష్ఠుఁడైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా !
శ్రీకృష్ణుని నిశిత చక్రధారలచేత వధింపబడిన శిశుపాలుని దేహం నుండి వెలువడిన దివ్యతేజం అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుడిలో ప్రవేశించింది. అది చూసిన ధర్మరాజు, ఎప్పుడూ శ్రీకృష్ణుడిని నిందిస్తూ వైరభావంతో ఉండే శిశుపాల దంతవక్త్రులు, మరణానంతరం విష్ణుసాయుజ్యం పొందటం ఆశ్చర్యంగా ఉందని ధర్మరాజు నారదమునిని సందేహనివృత్తి చేయమని అడిగాడు.
దానికి నారదుడు, దూషణభూషణ తిరస్కారాలు శరీరానికి ఉంటాయి గాని, పరమాత్మకు ఉండవనీ, శరీరం మీద అభిమానం చేత, పరుషవాక్యాలు, హింస, బాధ, నేను, నావి, అనే భావాలు జీవుడికి కలుగుతాయి గానీ, సర్వభూతాత్మకుడైన హరికి ఈ వైషమ్యభావాలు ఉండవని చెప్పాడు. దానినే మరింత వివరిస్తూ:
" కృష్ణుని మీద కలిగిన మన్మథ భావంతో గోపికలు, భయంతో కంసుడు, విరోధంతో శిశుపాలుడు మొదలైన రాజులు, బంధుత్వంతో వృష్ణివంశ యాదవులు, ప్రేమతో మీరు, నిరంతర హరినామ స్మరణ చేస్తూ భక్తిభావంతో మేము, చక్రధారియైన విష్ణుసాన్నిధ్యాన్ని పొందాము. ఏ విధంగా అయినా సరే, ఏకాగ్రచిత్తంతో స్మరిస్తే తప్పకుండా నారాయణుని చేరవచ్చు. "
భాగవతం లోనే మరొకచోట నవవిధ భక్తిమార్గాలు చెప్పబడ్డాయి. మనసారా ముకుందుడిని భజిస్తే, ముక్తిమార్గాలు వేరయినప్పటికీ, ముక్తిని పొందడం మాత్రం ఖాయమని భగవంతుని మాట.
ఇది చాల ప్రసిద్ధమైన పద్యం. ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభాగవతము సప్తమ స్కంధంలో ఉంది.
No comments:
Post a Comment