అణువో గాక కడున్ మహావిభవుడో, అచ్ఛిన్నుడో, చ్ఛిన్నుడో,
గుణియో, నిర్గుణుడో, యటంచు విబుధుల్, గుంఠీభవతత్త్వ మా
ర్గణులై, యే విభు పాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ
క్షణముం జేసెద రట్టి విష్ణు బరమున్ సర్వాత్ము సేవించెదన్.
శ్రీ శుకమహర్షి భగవంతుడైన శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తున్నాడు.
" పరమాత్మ సూక్ష్మ స్వరూపుడా లేక మహా స్వరూపుడా? దేశకాలాతీతుడా లేక దేశకాలబద్ధుడా? సగుణుడా లేక నిర్గుణుడా? ఇటువంటి తత్త్వాన్వేషణ చేసిన పండితులు, చివరకు ఏ పాదపద్మములను నిశ్చలమైన భక్తితో కొలిచి నీ యదార్థ స్వరూపం తెలుసుకోగలుగుతున్నారో, అటువంటి, విశ్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడైన విష్ణువును స్మరిస్తాను. "
పరమాత్మను సూక్ష్మస్వరూపుడని భావిస్తే, అణువు కంటె చిన్నవాడని, లేదా మహత్స్వరూపుడని భావిస్తే మహత్తరమైన దాని కంటె మహత్తరమైన వాడని, (అణోరణీయాన్మహతో మహీయాన్) అని కఠోపనిషత్తు స్పష్టం చేస్తున్నది. కైవల్యోపనిషత్తు పరమాత్మ స్వరూపాన్ని " అణోరణీయా నహమేవ తద్వన్మహానహం విశ్వమహ విచిత్రమహం, పురాతనోహం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్మి " (అణువు కంటె సూక్ష్మమ్ముగను, మహత్తు కంటె మహత్తరముగను,సర్వవ్యాపకుడుగను, పురాతనుడుగను, జ్యోతిస్వరూపుడుగను, మంగళరూపుడుగను) వర్ణిస్తున్నది.. " ఆత్మా వా ఇద మేక ఏవాగ్ర ఆసీత్ నాన్యత్కించ న మిషత్, స ఈక్షత ల్లోకాన్ సృజా ఇతి. ( ఈ ప్రపంచము సృష్టికి పూర్వము ఒకే ఆత్మగా ఉండినది. ఆ ఆత్మ తప్ప వేరొకటి ఏదియును లేదు. ఈ ఆత్మ లోకములను సృష్టించవలయునని ఆలోచించెను.) అని ఐతరేయోపనిషత్తు చెబుతున్నది . ఆత్మస్వరూపుడైన భగవంతుడు ఈ విధంగా దేశకాలాతీతుడు, దేశకాలబద్ధుడుకూడా. " దేహత్రయ మస ద్విద్ధి కాలత్రయ మసత్సదా, గుణత్రయ మసద్విద్ధి హ్యహం సత్యాత్మక శ్శుచిః ( దేహత్రయము అసత్యమని యెఱుగుము. అట్లే కాలత్రయము, గుణత్రయము సదా అసత్యమని తెలిసికొనుము. నేను (ఆత్మ) సత్యస్వరూపుడుడను, శుచిస్వరూపుడను. ". " అహమేవ గుణాతీత అహమేవ పరాత్పరః, అహమేవ పరం బ్రహ్మ అహమేవ గురోర్గురుః ( నేను గుణాతీతుడను. నేనే పరాత్పరుడను. నేనే పరబ్రహ్మమును. నేనే గురోర్గురువును. ) అని తేజోబిందూపనిషత్తు చెబుతున్నాది.
అందువల్ల, పరమాత్మ, నిర్వికారుడు, నిర్గుణుడు, అద్వితీయుడైనప్పటికీ. వికృతి చెంది, సగుణుడై, ఈ జగత్తునందు భాసిస్తూ, సర్వాత్మల యందు ఆత్మస్వరూపుడిగా ప్రకాశిస్తున్నాడు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభాగవతము, ద్వితీయస్కధంలో ఉంది.
No comments:
Post a Comment