ధనమును విద్యయు వంశం
బును దుర్మతులకు మదంబు బొనరించును; స
జ్జనులైన వారి కడకువ
యును వినయంబు నివియ దెచ్చు నుర్వీనాథా !
అరిది విలుకాని యుజ్జ్వల
శర మొక్కని నొంచు; దప్పి చనినం జను నే
ర్పరియైన వాని నీతి
స్ఫురణము పగరాజు, నతని భూమిం జెఱుచున్.
" ధనము, విద్య, వంశం అనేవి చెడ్డవారికి గర్వాన్ని కలిగిస్తాయి. ఇవే మంచివారికి అణకువ, విన్నయాన్ని తెచ్చిపెడతాయి.
విలుకాని బాణం ఒక్కడినే బాధిస్తుంది. ఒక్కొక్కప్పుడు గురి తప్పవచ్చు కూడా. అదే, బుద్ధిశాలి అయిన వాడి రాజనీతి శత్రువునే గాక శత్రురాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తుంది. "
మొదటి పద్యానికి సంస్కృత మూలం ఇలా ఉంది.
" విద్యామదో ధనమద స్తృతీయభి జనోమదః
ఏతే మదావ లిప్తానా మేత ఏవ సతాం దమాః
" భారత నిరుక్తి - తిక్కన సరసోక్తి " అనే గ్రంథంలో మొదటి పద్యానికి
విశేష వ్యాఖ్య వ్రాస్తూ, డాక్టరు టి. రామకృష్ణమూర్తి, సూరం శ్రీనివాసులు గార్లు , పై సంస్కృత మూలాన్ని పేర్కొంటూ, అందులో వ్యాసభగవానుడు శబ్దచమత్కారం కూడా చూపించాడన్నారు. ధనం,విద్య, వంశం అనేవి, దుర్మార్గులకు ' మదం ' , సన్మార్గులకు " దమం ' కలిగిస్తాయి. (అక్షరాలు తిరగబడ్డాయి - మదం - దమం అయింది.). కథాపరంగా మదం దుర్యోధనుడి తలకెక్కింది. ధర్మరాజుకి దమం పెరిగింది.

దమOఅంటే అంతరింద్రియ నిగ్రహం.
ఇక రెండవ పద్యం, శారీరక బలం కంటె మానసిక, ఆధ్యాత్మిక బలం గొప్పదని తెలియజేస్తున్నది. ధర్మరాజు విజయానికి మూలకారణం అతని ధర్మ బలం. చారిత్రక సత్యం కూడ దీనిని ఋజువు చేస్తున్నది. మహాత్ముని శాంత్యహింసలనే ఆయుధాలు రవి అస్తమించని ఆంగ్లసామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకలించి వేయడమే గాక, ఇంకెన్నో దేశాల స్వాతంత్ర్యానికి దోహదం చేసాయి.
పై రెండు పద్యాలు శ్రీమదాంధ్ర మహాభారతము, ఉద్యోగపర్వము, ద్వితీయాశ్వాసములో ఉన్నాయి.
No comments:
Post a Comment