క్రూరుఁడు లోభియున్ శఠుఁడు గొండియుఁడున్ జడుడుం గృతజ్ఞుఁడున్
నేరనివాఁడు బొంకరియు నిందకు నోర్చు నతండుఁ బందయున్
ధీరతలేమి దుర్నయ మతివ్యసనత్వముఁ గల్గు వారలుం
జేరువ నున్కి భూపతికిఁ జెట్ట యొనర్చు నరేశ్వరోత్తమా !
అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని వద్ద ధర్మ సందేహాలను అడిగి తెలుకుంటున్నాడు ధర్మరాజు. ఒకరోజు, ఇంటికి తిరిగివచ్చిన తరువాత ఇష్టాగోష్ఠిగా తమ్ముళ్ళను, ద్రౌపదిని ధర్మార్థకామమోక్షాలను గురించి అడిగాడు. అన్నీ విన్న తరువాత, విదురుడు కూడా వాటిని గురించి వివరణ ఇచ్చాడు. మరుసటి రోజు, ధర్మరాజు భీష్ముడిని, రాజైనవాడు ఎవరిని హితులుగా, ఎవరిని అహితులుగా తెలుసుకోవాలని అడిగాడు. హితులను పేర్కొన్న భీష్ముడు, ఎవరిని దూరంగా ఉంచాలో ఇప్పుడు చెబుతున్నాడు.
" క్రూరస్వభావుడిని, పేరాశ కలవాడిని, మూర్ఖుడిని, చాడీలు చెప్పేవాడిని, బద్ధకస్తుడిని, చేసిన మేలు మరచిపోయినవాడిని, తెలివితక్కువవాడిని, అబద్ధాలాడేవాడిని, , ఎంత తిట్టినా దులుపుకు పోయేవాడిని, , పిరికివాడిని, ధీరగుణం లేనివాడిని, నీతినియమాలు లేనివాడిని, చెడు అలవాట్లకు లోనయినవాడిని, రాజు దూరంగా ఉంచాలి. లేకపోతే, వాళ్ళ వలన ఆపదలు వస్తాయి. "
నీతి కథల రూపంలో కూడా పెద్దలు మనకు ఈ విషయాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్పారు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతి పర్వం, తృతీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment